వారికి ఇష్టం లేకపోతే రంగులు చల్లొద్దు: సజ్జనార్

  • రేపు హోలీ పండుగ
  • ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్న సీపీ
  • రంజాన్ ప్రార్థనలకు ఆటంకం కలగకుండా చూడాలని ఆదేశాలు
  • బలవంతంగా రంగులు పూయడంపై నిషేధం
  • రేపు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు మద్యం బంద్
  • న్యూసెన్స్ చేసే వారిపై షీ టీమ్స్ ప్రత్యేక నిఘా
హైదరాబాద్‌లో హోలీ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, ఇతరులకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని నగర పోలీస్ కమిషనర్ వి.సి.సజ్జనార్ హెచ్చరించారు. సోమవారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. పండుగ నేపథ్యంలో నగరంలో పలు ఆంక్షలు విధించారు. ఎవరికైనా ఇష్టం లేకపోతే, లేని వారిపై బలవంతంగా రంగులు చల్లడం, పాదచారులు, వాహనాలపై రంగులు లేదా రంగు నీళ్లు చల్లడం నిషేధమని స్పష్టం చేశారు.

ప్రస్తుతం రంజాన్ మాసం కొనసాగుతున్నందున ముస్లింల ప్రార్థనలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు భద్రత ఏర్పాటు చేయాలని, పీస్ కమిటీలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. నగరవ్యాప్తంగా విజిబుల్ పోలీసింగ్, బ్లూ కోల్ట్స్, పెట్రోలింగ్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే ఆకతాయిలపై షీ టీమ్స్ ప్రత్యేక నిఘా ఉంచుతాయని తెలిపారు.

హోలీ వేడుకల్లో డీజేలకు అనుమతి లేదని, రసాయన రంగులకు బదులుగా సహజ రంగులు వాడాలని సీపీ సూచించారు. యువకులు రోడ్లపై గుంపులుగా తిరుగుతూ న్యూసెన్స్ చేస్తే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలు, బార్లు, కల్లు కాంపౌండ్లు మూసివేయాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై సిటీ పోలీస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని, ఎక్కడైనా సమస్య తలెత్తితే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


More Telugu News