Chandrababu Naidu: బాణసంచా పేలుడు ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి... ప్రమాద స్థలానికి వెళ్లాలంటూ హోంమంత్రి అనితకు ఆదేశాలు

Chandrababu Naidu reacts to Kakinada fire accident orders Home Minister visit
  • కాకినాడ జిల్లా బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు
  • ప్రమాద ఘటనలో 18 మంది మృతి
  • ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు
  • వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని హోంమంత్రి అనితకు ఆదేశం
  • సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు సూచన
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం, జి.మేడపాడు గ్రామాల మధ్య ఉన్న ఓ బాణసంచా తయారీ కేంద్రంలో సంభవించిన భారీ పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘోర ప్రమాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ప్రస్తుతం హెచ్‌పీవీ వ్యాక్సిన్ల పంపిణీ కార్యక్రమం నిమిత్తం విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబుకు.. అధికారులు ఈ దుర్ఘటన గురించి సమాచారం అందించారు. ప్రమాద తీవ్రత, ప్రాణనష్టం వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. విషయం తెలిసిన వెంటనే స్పందించిన చంద్రబాబు.. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితను అప్రమత్తం చేశారు. హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లాలని, పరిస్థితులను స్వయంగా పర్యవేక్షించాలని ఆమెను ఆదేశించారు.

అలాగే, ప్రమాద స్థలంలో తక్షణమే సహాయ చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా యంత్రాంగాన్ని సీఎం ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కాగా, ఈ పేలుడు ధాటికి భారీ ఎత్తున ప్రాణనష్టం సంభవించడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో మరో 15 మందికి తీవ్ర గాయాలు కాగా, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. 
Chandrababu Naidu
Kakinada fire accident
fireworks explosion
Andhra Pradesh accident
Samarlakota
Vangalapudi Anitha
firecracker factory
accident news
AP Home Minister
casualties

More Telugu News