Kakinada fire accident: కాకినాడ జిల్లాలో బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు... 18 మంది దుర్మరణం

Kakinada Fire Accident 18 Killed in Fireworks Factory Explosion
  • కాకినాడ జిల్లా సూర్యశ్రీ ఫైర్‌వర్క్స్ కేంద్రంలో భారీ పేలుడు
  • ఘటనా స్థలంలోనే 18 మంది దుర్మరణం
  • పేలుడు ధాటికి పొలాల్లోకి ఎగిరిపడ్డ మృతదేహాలు
  • ఐదు కిలోమీటర్ల మేర వినిపించిన భారీ శబ్దం
  • తీవ్రతకు పక్క గ్రామంలోని స్కూల్ స్లాబ్ కు పగుళ్లు
జిల్లాలో శనివారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సామర్లకోట మండలం వేట్లపాలెం, జి.మేడపాడు గ్రామాల మధ్య గోదావరి కాలువ పక్కన ఉన్న సూర్యశ్రీ ఫైర్‌వర్క్స్ కేంద్రంలో భారీ విస్ఫోటనం సంభవించింది. ఈ ప్రమాదంలో 18 మంది మరణించడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి.

ప్రమాద తీవ్రత ఊహించని స్థాయిలో ఉంది. పేలుడు ధాటి ఎంత భయానకంగా ఉందంటే.. అక్కడ పనిచేస్తున్న కార్మికుల మృతదేహాలు తునాతునకలై గాల్లోకి ఎగిరి, పక్కనే ఉన్న పొలాల్లో పడ్డాయి. చెల్లాచెదురుగా పడి ఉన్న శరీర భాగాలు చూసి స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. పేలుడు శబ్దం దాదాపు 5 కిలోమీటర్ల వరకు వినిపించిందని, దట్టమైన పొగలు ఆ ప్రాంతాన్ని కమ్మేశాయని స్థానికులు తెలిపారు. ఈ పేలుడు తీవ్రతకు పక్క గ్రామంలోని ఓ ప్రైవేటు పాఠశాల స్లాబ్ కూడా పగుళ్లు ఇచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. తీవ్రంగా గాయపడిన మరో 8 మందిని అంబులెన్సుల్లో సమీప ఆసుపత్రులకు తరలించారు. పోలీసులు, ఇతర అధికారులు ఘటనా స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. బాణసంచా తయారీలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, అమాయక ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Kakinada fire accident
Andhra Pradesh fire accident
fireworks factory explosion
Samarlakota
Vetlapalem
G Medapadu
firecracker factory
fire accident deaths

More Telugu News