Chandrababu Naidu: విజయనగరం జిల్లాలో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన

Chandrababu Naidu Visits Vizianagaram District Today
  • చీపురుపల్లిలో రాష్ట్రస్థాయి హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం
  • లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో పాల్గొననున్న సీఎం
  • రావివలసలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో ప్రసంగించనున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన రెండు కీలక సంక్షేమ, ఆరోగ్య పథకాలకు శ్రీకారం చుట్టనున్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో రాష్ట్రవ్యాప్త హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిల్లోమా వైరస్) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడంతో పాటు, ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేయనున్నారు. 

పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి మొదట చీపురుపల్లిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు (సీహెచ్‌సీ) చేరుకుని, బాలికలలో గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఉద్దేశించిన హెచ్‌పీవీ వ్యాక్సిన్ డ్రైవ్‌ను ప్రారంభిస్తారు. ఇదే సమయంలో రాజస్థాన్‌లోని అజ్మీర్ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుండగా, సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇందులో పాల్గొంటారు. 

అనంతరం, రావివలస సమీపంలోని పైలపేటలో ఏర్పాటు చేసిన 'ప్రజావేదిక' బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా కొందరు లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అందజేస్తారు. విజయనగరం జిల్లావ్యాప్తంగా ఈ నెల 2,69,748 మంది లబ్ధిదారులకు రూ.114.83 కోట్ల పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

ప్రభుత్వ కార్యక్రమాల అనంతరం, ముఖ్యమంత్రి టీడీపీ కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.
 
 
Chandrababu Naidu
Andhra Pradesh
Vizianagaram district
HPV vaccination
NTR Bharosa pension
Cheepurupalli
AP CM
YSR pension scheme
public meeting
Paila Peta

More Telugu News