Chandrababu Naidu: ఘటనలు జరిగాక స్పందిస్తే ప్రయోజనం లేదు: అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

Chandrababu Naidu Focuses on Preventive Measures After Incidents
  • శ్రీకాకుళం, రాజమండ్రి ఘటనలపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
  • బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి
  • ముందస్తు నివారణే ముఖ్యమని స్పష్టీకరణ
  • క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేసి యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని కలెక్టర్లకు సూచన
  • బాధితులకు అందుతున్న వైద్య సాయం, క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా తీసిన సీఎం
శ్రీకాకుళం పట్టణంలో కలుషిత తాగునీటి కారణంగా డయేరియా ప్రబలడం, రాజమండ్రిలో కల్తీ పాల వల్ల పలువురు ప్రాణాలు కోల్పోవడం వంటి తీవ్రమైన ఘటనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో మున్సిపల్, వైద్యారోగ్య శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ రెండు విషాద ఘటనల్లో ప్రజల ప్రాణాలు పోవడానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఏమాత్రం ఉపేక్షించవద్దని అధికారులను తీవ్రంగా హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడటమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం కావాలని స్పష్టం చేశారు.

ముందస్తు చర్యలే ముఖ్యం: సీఎం చంద్రబాబు

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. "ఘటన జరిగాక స్పందించడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ముందస్తు పర్యవేక్షణ, అప్రమత్తత ద్వారా ఈ తరహా ఘటనలు జరగకుండా చూడాలి. శ్రీకాకుళంలో తాగునీరు కలుషితమైన ఘటనలో ముందస్తు తనిఖీలు జరిగి ఉంటే ఈ సమస్య వచ్చేదే కాదు" అని అభిప్రాయపడ్డారు. జిల్లా కలెక్టర్లు, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టడం ద్వారా ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు. 

ప్రతి ప్రభుత్వ విభాగంలో కింది స్థాయి యంత్రాంగాన్ని క్రియాశీలం చేసేందుకు, క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రతి అధికారి విధిగా పర్యటించాలన్నారు. ఒక్కో సందర్భంలో ఒక్కో శాఖపై ఆకస్మిక తనిఖీకి వెళ్లడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని, కిందిస్థాయి అధికారులతో పాటు సంబంధిత శాఖల్లో జవాబుదారీతనం పెరుగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. కలెక్టర్లు అంటే నిత్యం ప్రజల్లోనే ఉండాలని, అప్పుడే రాష్ట్ర స్థాయిలో అనుకున్న మార్పును తీసుకురాగలమని ఆయన పేర్కొన్నారు.

శ్రీకాకుళంలో 107 మందికి చికిత్స: కలెక్టర్

సమీక్షలో భాగంగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్, ఆన్‌లైన్ ద్వారా మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుత పరిస్థితులను సీఎంకు వివరించారు. “జిల్లాలో ఇప్పటి వరకు 129 డయేరియా కేసులు నమోదు కాగా, ప్రస్తుతం 107 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 20 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. పైపుల ద్వారా నీటి సరఫరాను నిలిపివేసి, ట్యాంకర్ల ద్వారా సురక్షితమైన నీటిని అందిస్తున్నాం. నాలుగు ఇంజనీరింగ్ బృందాలు 40 లీకులను గుర్తించి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నారు. 150 మంది సిబ్బంది, 7 జేసీబీలు, 10 ట్రాక్టర్లతో పారిశుద్ధ్య పనులు చేపట్టాం. విశాఖ నుంచి మొబైల్ టెస్టింగ్ ల్యాబ్‌ను తరలిస్తున్నాం. ప్రభావిత ప్రాంతాల్లో 24 గంటలూ పనిచేసేలా మెడికల్ క్యాంపులు, ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశాం” అని తెలిపారు. 

స్థానికులు వాటర్ ట్యాంకులు శుభ్రం చేసుకోకపోవడం, పైప్‌లైన్లు డ్రైన్లను క్రాస్ అవ్వడం, నీటి ప్రెజర్ లేకపోవడంతో మోటార్లు పెట్టి నీటిని తోడటం వల్ల కలుషిత నీరు ఇళ్లకు చేరిందని ప్రాథమికంగా గుర్తించినట్లు అధికారులు వివరించారు.

రాజమండ్రి ఘటనలో 8 మంది పరిస్థితి విషమం

అనంతరం రాజమండ్రి కల్తీ పాల ఘటనపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సీఎంకు వివరాలు అందించారు. ‘‘ఈ నెల 22న వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో 20 మంది అనారోగ్యం పాలుకాగా, ఐదుగురు మృతి చెందారు. మరో 15 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, వారిలో 8 మంది పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ప్రభావిత ప్రాంతాల్లో 9 వైద్య బృందాలు పనిచేస్తున్నాయి. 957 మందిని నిత్యం పర్యవేక్షిస్తున్నాం. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాం. నిందితుడైన పాల సరఫరాదారు గణేశ్వరరావును అరెస్ట్ చేసి విచారిస్తున్నాం. బాధితుల ప్రాణాలు కాపాడేందుకు ఇతర ప్రాంతాల నుంచి వైద్య నిపుణులను, పరికరాలను తెప్పించి మెరుగైన చికిత్స అందిస్తున్నాం’’ అని కలెక్టర్ వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారని అధికారులు తెలిపారు.

ఈ సమీక్షలో మంత్రులు నారాయణ, కొండపల్లి శ్రీనివాస్, నిమ్మల రామానాయుడు, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆన్‌లైన్ ద్వారా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం, రాజమండ్రి ఎమ్మెల్యేలు, రెండు జిల్లాల ఎస్పీలు కూడా పాల్గొన్నారు.


Chandrababu Naidu
Srikakulam
Rajahmundry
contaminated water
adulterated milk
diarrhea outbreak
food safety
Andhra Pradesh
health crisis
district collectors

More Telugu News