Sinkhole: అమెరికాలో సడెన్ గా కుంగిన భూమి.. గుంతలో పడిపోయిన కార్లు.. వీడియో ఇదిగో!

Sinkhole Swallows Cars in Omaha Nebraska Incident
  • అమెరికాలోని ఒమాహా సిటీలో ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం
  • ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వాహనాలు నిలిచిన సమయంలో ఘటన
  • అదృష్టవశాత్తూ వాహనదారులకు తప్పిన ప్రమాదం
అమెరికాలోని ఒమాహా నగరంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రోడ్డు ఉన్నట్టుండి కుంగిపోయి, భారీ గుంత ఏర్పడింది. ఆ సమయంలో రెడ్ సిగ్నల్ పడడంతో అక్కడ ఆగిన రెండు కార్లు గుంతలో పడిపోయాయి. అయితే, అదృష్టవశాత్తూ అందులోని ప్రయాణికులకు పెద్దగా గాయాలు కాలేదు. ఈ ఘటన మొత్తం అక్కడున్న సీసీటీవీ కెమెరాలలో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే..

ఒమాహా సిటీలోని 67వ, పసిఫిక్ వీధుల జంక్షన్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్ పడటంతో వాహనాలు ఆగుతున్న సమయంలో ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయి భారీ గుంత ఏర్పడింది. ఈ అనూహ్య ఘటనలో ఒక మెరూన్ కలర్ జీప్ ఎస్‌యూవీ, ఒక సిల్వర్ కలర్ డాడ్జ్ రామ్ పికప్ ట్రక్కులు ఆ గుంతలో పడిపోయాయి. మంగళవారం మధ్యాహ్నం సుమారు 3:30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అత్యవసర సేవా సిబ్బంది అక్కడికి చేరుకునేలోపే, ఆ రెండు వాహనాల్లోని డ్రైవర్లను తోటి వాహనదారులు కాపాడారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

భూగర్భంలో నీటి పైపులైన్ లీక్ కావడం వల్ల లోపల మట్టి కోతకు గురై, పైన ఉన్న రోడ్డుకు పట్టు కోల్పోవడమే ఈ సింక్ హోల్ ఏర్పడటానికి ప్రధాన కారణమని సిటీ ఇంజనీర్ ఆస్టిన్ రోజర్ తెలిపారు. గుంత మరింత విస్తరించే అవకాశం ఉన్నందున ఆ ప్రాంతానికి ఎవరూ రావద్దని పోలీసులు హెచ్చరించారు. మెట్రోపాలిటన్ యుటిలిటీస్ డిస్ట్రిక్ట్ సిబ్బంది ఘటనా స్థలంలో మరమ్మతులు చేపట్టారు.
Sinkhole
Car Accident
Omaha Nebraska
Road Collapse
Traffic Signal
Water Pipeline Leak
67th and Pacific Streets
Omaha City
Nebraska

More Telugu News