పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు.. వీడియో ఇదిగో!

Mumbai Fruit Vendors Arrested for Using Rat Poison on Fruits
ముంబైలోని మలాడ్ వెస్ట్ ప్రాంతంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఇద్దరు పండ్ల వ్యాపారుల నిర్వాకం కలకలం రేపింది. అమ్మకానికి ఉంచిన పండ్లపై ఎలుకల మందు పూస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని అరెస్ట్ చేశారు. బుధవారం స్థానికుడు ఒకరు వీడియో ఆధారాలతో ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

నిందితులను రాజన్‌ పాడాకు చెందిన మనోజ్ సంగమ్‌ లాల్ కేసర్వానీ (42), రాహుల్ సదన్‌ లాల్ కేసర్వానీ (25)గా గుర్తించారు. రోడ్డు పక్కన ఉన్న వారి స్టాల్‌ను తనిఖీ చేసిన అధికారులు.. అక్కడ అత్యంత విషపూరితమైన 'రాటోల్'  అనే ఎలుకల మందును స్వాధీనం చేసుకున్నారు. ఇందులో పసుపు భాస్వరం వంటి ప్రాణాంతక రసాయనాలు ఉంటాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

విచారణలో ఏం చెప్పారంటే..
పోలీసుల విచారణలో నిందితులు విస్తుపోయే కారణం చెప్పారు. రాత్రిపూట ఎలుకలు తమ పండ్లను పాడు చేయకుండా ఉండేందుకే తాము ఇలా మందు పూసినట్లు వారు అంగీకరించారు. అయితే, ఆహార పదార్థాలపై ఇటువంటి విషపూరిత రసాయనాలు వాడటం వల్ల వాంతులు, కడుపునొప్పి, అవయవాల వైఫల్యం సహా ప్రాణాపాయం కూడా ఉంటుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ముంబై మున్సిపల్ కార్పొరేషన్, ఎఫ్ డీఏ అధికారులు వీధి వ్యాపారులపై నిరంతరం తనిఖీలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియో చూసిన ప్రజలు బయట పండ్లు కొనాలంటే భయాందోళనలకు గురవుతున్నారు.
Go Back to Shorts
Fruits
Rat poison
Food Safety
Mumbai
Malad West
Pest control
Mumbai Municipal Corporation
FDA
Manoj Sangam Lal Kesarwani
Rahul Sadan Lal Kesarwani

More Telugu News