YS Sharmila: వైఎస్సార్‌పై చేసిన వ్యాఖ్యలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలి: షర్మిల
- వైసీపీ చేసిన తప్పులను వైఎస్సార్ కు ఆపాదిస్తున్నారని షర్మిల మండిపాటు
- ఏడు కొండలు వెంకన్నవే అని జీవో ఇచ్చింది వైఎస్సారే అని వ్యాఖ్య
- వైసీపీలో వైఎస్సార్ లేరన్న షర్మిల
ఏపీ అసెంబ్లీలో తిరుమల లడ్డూ కల్తీపై జరుగుతున్న చర్చ ఇప్పుడు వైఎస్ కుటుంబాన్ని రచ్చకీడ్చమే కాకుండా, రాజకీయంగా కొత్త మలుపులు తిరుగుతోంది. వైసీపీ చేసిన తప్పులను తన తండ్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆపాదించడంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 'అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు' కూటమి ప్రభుత్వ తీరు ఉందని ఎద్దేవా చేస్తూ, అసెంబ్లీ రికార్డుల నుంచి వైఎస్సార్‌పై చేసిన వ్యాఖ్యలను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు.
వైఎస్సార్ హయాంలో ఏడు కొండలను రెండు కొండలు చేయాలని చూశారన్న విమర్శలను షర్మిల గట్టిగా తిప్పికొట్టారు. "జరిగిందంతా తప్పుడు ప్రచారమే. నాడు ప్రతిపక్ష నేతగా చంద్రబాబే బురద చల్లారు. వాస్తవానికి ఏడు కొండలు వెంకన్నవేనని 2007లో శాశ్వత జీవో ఇచ్చి చరిత్ర సృష్టించింది వైఎస్సార్" అని ఆమె గుర్తు చేశారు. తిరుమల క్షేత్రంలో అన్యమత ప్రచారాన్ని అడ్డుకోవడానికి జీవో 746, 747లను తీసుకొచ్చి కఠిన నిబంధనలు అమలు చేసిన ఘనత తన తండ్రిదేనని, లడ్డూకు 2009లో అంతర్జాతీయంగా పేటెంట్ రైట్స్ సాధించింది కూడా ఆయనేనని స్పష్టం చేశారు.
వైసీపీ పాలనను, వైఎస్సార్ సంక్షేమ పాలనను ఒకటిగా చూడవద్దని షర్మిల హితవు పలికారు. "వైసీపీ పాలన దోచుకుతినే పాలన అయితే, వైఎస్సార్ పాలన పేదల సంక్షేమ పాలన. వైసీపీలో అసలు వైఎస్సార్ లేనే లేడు" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజశేఖర్ రెడ్డి ముమ్మాటికీ కాంగ్రెస్ మనిషి అని, కడవరకు కాంగ్రెస్‌లోనే బతికిన ఆయనను వ్యక్తిగతంగా దూషించడం చంద్రబాబుకు భావ్యం కాదన్నారు. వేద పండితుల కోసం 'ఆయుష్మాన్ భవ', దళితుల కోసం 'దళిత గోవిందం' వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న మహానేతను దేవుడిగా కొలుస్తారని అన్నారు.