సోము వీర్రాజుపై బొత్స వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం: మండలిలో మంత్రి నారా లోకేశ్

Nara Lokesh Condemns Botsas Comments on Somu Veerraju in Council
శాసనమండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్ సోము వీర్రాజును ఉద్దేశించి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలు వ్యక్తిగత దాడి కిందకే వస్తాయని, వాటిని తక్షణమే సభా రికార్డుల నుంచి తొలగించాలని ఛైర్మన్‌ను డిమాండ్ చేశారు. వాస్తవాలు వినే ఓపిక లేక వాకౌట్ చేయడం ప్రతిపక్ష నేత బొత్సకు ఫ్యాషన్ గానే కాకుండా, ప్యాషన్‌గానూ మారిందని ఆయన ఎద్దేవా చేశారు.

మంగళవారం నాడు శాసనమండలిలో శాంతిభద్రతల అంశంపై జరిగిన స్వల్పకాలిక చర్చ వాడివేడిగా సాగింది. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ... గత వైసీపీ ప్రభుత్వ హయాంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. చిలకలూరిపేటలో జరిగిన ప్రధాని సభను సరిగా నిర్వహించలేకపోయారని, భద్రతా వైఫల్యం కారణంగానే అప్పటి ఎస్పీపై బదిలీ వేటు పడిందని గుర్తుచేశారు.

సోము వీర్రాజు వ్యాఖ్యలపై వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం తెలిపారు. సోము వీర్రాజు ఎవరో ఒకరిని మెప్పించడానికి, భజన చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కూటమి పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయని విమర్శిస్తూ, చర్చలో ప్రధాని ప్రస్తావన తీసుకురావడాన్ని నిరసిస్తూ వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించి వెళ్లిపోయారు. దీనిపై హోంమంత్రి అనిత మాట్లాడుతూ.. వైసీపీ సభ్యులు అబద్ధాలు చెప్పి వాకౌట్ చేస్తారని విమర్శించారు.

అనంతరం మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ బొత్స తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. "బొత్స వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరం. మేం ఇక్కడికి సభ్యులను మెప్పించడానికి రాలేదు. ఆ రోజు ప్రధాని సభలో మేమంతా ఉన్నాం. ఎంత ఇబ్బంది పడ్డామో మాకు తెలుసు. కనీస భద్రత కల్పించలేదు, బ్యారికేడ్లు విరిగిపోయాయి. ప్రధాని మాట్లాడుతుండగా మైక్ కూడా కట్ అయింది. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం నోటీసు ఇచ్చి అధికారులను సస్పెండ్ చేసిన విషయం బొత్స తెలుసుకోవాలి" అని లోకేశ్ అన్నారు.

"శాంతిభద్రతలపై చర్చ జరుగుతుంటే వాకౌట్ ఎందుకు? వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మాపై, వినాల్సిన బాధ్యత వారిపై లేదా? మధ్యాహ్నం రెండు కాగానే వారికి ఆకలేస్తుంది, వాకౌట్ అని బయటకు వెళతారు. సోము వీర్రాజుపై బొత్స వ్యక్తిగత దాడికి దిగారు. ఇది ఏమాత్రం సరికాదు. ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి" అని లోకేశ్ మండలి ఛైర్మన్‌ను కోరారు. దీంతో సభలో కొంతసేపు గందరగోళ వాతావరణం నెలకొంది.
Go Back to Shorts
Somu Veerraju
Botsa Satyanarayana
Nara Lokesh
Andhra Pradesh Legislative Council
BJP
YSRCP
Chilakaluripeta
Prime Minister Sabha
Law and Order
Political Controversy

More Telugu News