మణిపురి సినిమా 'బూంగ్'కు 'బాఫ్టా' అవార్డు... ప్రధాని మోదీ స్పందన

  • బెస్ట్ చిల్డ్రన్స్ అండ్ ఫ్యామిలీ ఫిల్మ్‌గా పురస్కారం
  • చిత్ర బృందాన్ని అభినందించిన ప్రధాని నరేంద్ర మోదీ
  • మణిపూర్‌లో శాంతి నెలకొనాలని ఆకాంక్షించిన దర్శకురాలు
  • మన దేశ ప్రతిభకు ఇది నిదర్శనమన్న ప్రధాని
భారతీయ ప్రాంతీయ సినిమా అంతర్జాతీయ వేదికపై సత్తా చాటింది. మణిపురి చిత్రం 'బూంగ్' ప్రతిష్ఠాత్మక 79వ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ (బాఫ్టా)లో పురస్కారాన్ని గెలుచుకుంది. 'బెస్ట్ చిల్డ్రన్స్ అండ్ ఫ్యామిలీ ఫిల్మ్' కేటగిరీలో ఈ సినిమా విజేతగా నిలిచింది. ఈ అరుదైన ఘనత సాధించిన చిత్ర బృందాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' వేదికగా స్పందించారు. "ఈ చిత్రంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ అభినందనలు. ఇది నిజంగా అపారమైన ఆనందాన్నిచ్చే క్షణం, ముఖ్యంగా మణిపూర్ ప్రజలకు. మన దేశంలోని అద్భుతమైన సృజనాత్మక ప్రతిభను ఈ విజయం చాటిచెబుతోంది" అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. 'ఆర్కో', 'లిలో అండ్ స్టిచ్', 'జూట్రోపొలిస్ 2' వంటి అంతర్జాతీయ చిత్రాలతో పోటీపడి 'బూంగ్' ఈ అవార్డును దక్కించుకోవడం విశేషం.

మణిపూర్‌లోని సామాజిక ఉద్రిక్తతల నేపథ్యంలో, విడిపోయిన తన కుటుంబాన్ని తిరిగి కలపడానికి ఓ బాలుడు చేసే ప్రయాణమే ఈ చిత్ర కథాంశం. గుగున్ కిప్జెన్, బాలా హిజామ్, విక్రమ్ కొచ్చర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ నటుడు ఫర్హాన్ అక్తర్ ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించారు.

ఈ అవార్డును స్వీకరించిన దర్శకురాలు లక్ష్మీప్రియా దేవి భావోద్వేగంగా ప్రసంగించారు. "ఎన్నో సమస్యలతో, సరైన ప్రాతినిధ్యం లేకుండా విస్మరించబడిన నా మాతృభూమి మణిపూర్‌కు ఈ చిత్రాన్ని అంకితమిస్తున్నాను. మణిపూర్‌లో తిరిగి శాంతి నెలకొనాలని ప్రార్థిస్తున్నాను" అని ఆమె పేర్కొన్నారు. ఈ సినిమా 2024 టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తొలిసారి ప్రదర్శితమైంది.


More Telugu News