Advertisement

ఏడాదిన్నరలో ప్రతి ఇంటికీ హైస్పీడ్ ఇంటర్నెట్: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu High Speed Internet for Every Home in 18 Months
  • గ్రామీణ కనెక్టివిటీ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కీలక ఒప్పందం
  • 5 లక్షల ఇళ్లకు ఫైబర్ కనెక్షన్లు ఇవ్వడమే లక్ష్యంగా అమెండెడ్ భారత్ నెట్ ప్రాజెక్ట్
  • గత ప్రభుత్వం ఫైబర్ నెట్ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందని చంద్రబాబు విమర్శ
  • టెక్నాలజీ ప్రయోగాలకు ఏపీని టెస్ట్ బెడ్‌గా మారుస్తామన్న ముఖ్యమంత్రి
రానున్న ఏడాదిన్నర కాలంలో రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. టెక్నాలజీ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటకే తీసుకెళ్లాలంటే డిజిటల్ కనెక్టివిటీ అత్యంత కీలకమని ఆయన అన్నారు. భారత్ నెట్ ప్రాజెక్టులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ కనెక్టివిటీని బలోపేతం చేసే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆదివారం సీఎం క్యాంపు కార్యాలయంలో కీలక సహకార ఒప్పందం (MoC) కుదిరింది. సీఎం చంద్రబాబు, కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. డిజిటల్ భారత్ నిధి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య కుదిరిన ఈ ఒప్పందంపై డిజిటల్ భారత్ నిధి అడ్మినిస్ట్రేటర్ శ్యామల్ మిశ్రా, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు సంతకాలు చేశారు.

భారత్ నెట్ ప్రాజెక్ట్‌తో డిజిటల్ విప్లవం

రాష్ట్రంలో సుమారు 5 లక్షల గ్రామీణ గృహాలకు ఫైబర్ కనెక్షన్లు అందించే లక్ష్యంతో 'అమెండెడ్ భారత్ నెట్ ప్రాజెక్ట్-ఏబీఎన్‌పీ'ని అమలు చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.2,432 కోట్లు కేటాయించడానికి అంగీకరించింది. ప్రాజెక్ట్ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం 'ఆంధ్రప్రదేశ్ భారత్‌నెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్' (APBIL) పేరుతో ప్రత్యేక యంత్రాంగాన్ని (SPV) ఏర్పాటు చేసింది. డిజిటల్ భారత్ నిధి, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిధులు సమకూర్చి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లనున్నాయి. 

రాష్ట్రవ్యాప్తంగా 13,426 గ్రామ పంచాయతీల్లో ఈ ప్రాజెక్టును అమలు చేయాలని ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా ఫేజ్-I కింద ఉన్న 1,692 పంచాయతీల్లో నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్ చేయడం, ఫేజ్-IIలోని 11,254 గ్రామాలకు డిజిటల్ కనెక్టివిటీ పూర్తి చేయడం, కొత్తగా ఏర్పడిన 480 గ్రామ పంచాయతీలకు కనెక్షన్లు ఇవ్వడం వంటి పనులు చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా డిజిటల్ గవర్నెన్స్, ఆన్‌లైన్ విద్య, టెలిమెడిసిన్, డిజిటల్ చెల్లింపులు, ఈ-గవర్నెన్స్ సేవలను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

గత ప్రభుత్వం ఫైబర్ నెట్‌ను నాశనం చేసింది: సీఎం

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. గత ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. "2014-19 మధ్య కాలంలో విద్యుత్ స్తంభాల ద్వారా ఫైబర్ కేబుల్స్ వేసి 9.78 లక్షల ఇళ్లకు ఫైబర్ నెట్ కనెక్షన్లు ఇచ్చాం. కానీ 2019లో వచ్చిన ప్రభుత్వం దురుద్దేశంతో ఆ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసింది. దాని ఫలితంగా కనెక్షన్ల సంఖ్య 3.80 లక్షలకు పడిపోయింది. ఇప్పుడు మళ్లీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో డిజిటల్ కనెక్టివిటీని ప్రతి ఇంటికీ అందిస్తాం" అని ఆయన వివరించారు. 

తాను తొలిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి టెక్నాలజీకి ప్రాధాన్యత ఇస్తున్నానని, టెలికాం రంగంలో సంస్కరణల కోసం నాటి ప్రధాని వాజ్‌పేయిని కోరిన విషయాన్ని గుర్తుచేశారు.

టెక్నాలజీతో సుపరిపాలన, ఏపీకి ఉజ్వల భవిష్యత్తు

"ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా నాయకత్వంలో దేశంలో డిజిటల్ విప్లవం అద్భుతంగా సాగుతోంది. గ్లోబల్ నాలెడ్జ్‌ను గ్రామాలకు చేర్చాలంటే బ్యాండ్ విడ్త్ పెరగాలి. దానికి కేంద్రం సహకరిస్తుండటం శుభపరిణామం" అని చంద్రబాబు అన్నారు. టెక్నాలజీతో పాలనను సులభతరం చేస్తున్నామని, వాట్సాప్ ద్వారా 900కు పైగా సేవలు అందిస్తున్నామని తెలిపారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీతో భూ రికార్డులకు భద్రత కల్పిస్తున్నామని, సంజీవని ప్రాజెక్టు ద్వారా ప్రజారోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తేబోతున్నామని చెప్పారు.

"ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో ఉద్యోగాలు పోతాయనే భయం వద్దు. ఏఐ ద్వారా కొత్త ఉద్యోగాలు సృష్టించేలా యువతలో నైపుణ్యాలు పెంచుతున్నాం. వన్ ఫ్యామిలీ-వన్ ఏఐ ఎక్స్‌పర్ట్ అనే విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టి కన్సార్షియంతో దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్‌ను రాష్ట్రానికి తెస్తున్నాం. రానున్న రెండేళ్లలో అమరావతి నుంచే క్వాంటం కంప్యూటర్లు ఉత్పత్తి చేయాలనేది మా ఆలోచన. టెక్నాలజీ, టెలికాం రంగంలో ఎలాంటి ప్రయోగాలు చేయాలన్నా ఆంధ్రప్రదేశ్ ఒక టెస్ట్ బెడ్‌గా సిద్ధంగా ఉంది" అని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఫైబర్ నెట్ ఎండీ గీతాంజలి శర్మ, బీఎస్ఎన్ఎల్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Advertisement
Chandrababu Naidu
Andhra Pradesh
High Speed Internet
BharatNet Project
Digital Connectivity
Jyotiraditya Scindia
Pemmmasani Chandrasekhar
Fiber Network
Digital Revolution
Rural Internet

More Telugu News