AI Summit: ఏఐ సమ్మిట్‌లో రచ్చ: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ

AI Summit Sparks Congress vs BJP Clash Nationwide
  • అమెరికా వాణిజ్య ఒప్పందంపై కాంగ్రెస్ ఆగ్రహం
  • ఢిల్లీ, చండీగఢ్‌లో వాటర్ కానన్ల ప్రయోగం
  • ఇండోర్‌లో ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడి
  • దేశ ప్రతిష్ఠను దిగజార్చారన్న అఖిలేశ్, మాయావతి
భారత మండపంలో జరిగిన అంతర్జాతీయ ‘ఏఐ సమ్మిట్’లో కాంగ్రెస్ చేపట్టిన 'షర్ట్‌లెస్' నిరసన రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం రైతులకు నష్టం చేకూరుస్తుందని ఆరోపిస్తూ కాంగ్రెస్ చేస్తున్న ఈ పోరాటం శనివారం హింసాత్మక రూపం దాల్చింది. ఢిల్లీ, చండీగఢ్, ఇండోర్ నగరాల్లో కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

చండీగఢ్‌లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దూసుకెళ్లిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు వాటర్ కానన్లను ప్రయోగించారు. అటు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇరు పార్టీల కార్యకర్తలు పిడిగుద్దులతో తలపడటమే కాకుండా రాళ్ల దాడికి దిగారు. ఈ గొడవలో జిల్లా అధ్యక్షుడు విపిన్ వాంఖడే గాయపడ్డారు. పోలీసుల రక్షణలోనే బీజేపీ కార్యకర్తలు తమ కార్యాలయంపై దాడి చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

ఈ నిరసన తీరుపై సొంత మిత్రపక్షాల నుంచే కాంగ్రెస్‌కు విమర్శలు ఎదురవుతున్నాయి. విదేశీ ప్రతినిధులు, టెక్ దిగ్గజాల ముందు ఇలాంటి ప్రదర్శనలు దేశ గౌరవానికి భంగం కలిగిస్తాయని సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యానించారు. అటు మాయావతి సైతం కాంగ్రెస్ తీరును 'అత్యాశాపూరితం' అని మండిపడ్డారు. ఇక బీజేపీ నేతలు రాహుల్ గాంధీని 'దేశద్రోహి'గా అభివర్ణిస్తూ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన నలుగురు నిందితులను పోలీసులు 5 రోజుల కస్టడీకి తీసుకున్నారు. నేపాల్‌లో ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన 'జెన్-జెడ్' (Gen Z) తరహా హింసాత్మక నిరసనల నుంచి వీరు స్ఫూర్తి పొందినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు పేర్కొంటున్నారు.

ఈ నిరసనల నేపథ్యంలో ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం (అక్బర్ రోడ్) వద్ద భద్రతను భారీగా పెంచారు. మహారాష్ట్రలో రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా బీజేపీ శ్రేణులు నల్లజెండాలతో నిరసన తెలిపే అవకాశం ఉన్నందున అక్కడ కూడా అప్రమత్తత ప్రకటించారు.
AI Summit
Congress
BJP
India AI Summit
Rahul Gandhi
Chandigarh
Indore
Protests India
India US trade deal
Akhilesh Yadav

More Telugu News