పరీక్షలు ఉన్నాయని ఆందోళన వద్దు: ఇంటర్ విద్యార్థులకు కవిత సూచన

తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఈ నెల 25వ తేదీ నుంచి జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విద్యార్థులకు సూచనలు చేశారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా, పూర్తి ఆత్మవిశ్వాసంతో, ప్రశాంతంగా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆమె ఆకాంక్షించారు. పదో తరగతి, ఇంటర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికి ఆమె శుభాకాంక్షలు తెలిపారు.

పరీక్షల్లో ఆందోళనకు గురికాకుండా ఎంత వస్తే అంత రాయాలని సూచించారు. ఫలితాల కోసం ఏమాత్రం ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు. పరీక్షలు బాగా రాయలేనేమోననే ఆందోళనతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు వార్త చూశానని, కాబట్టి ఫలితాల గురించి భయపడవద్దని అన్నారు. పరీక్షలు అనేవి జీవితంలో చిన్న పందెమని గుర్తుంచుకోవాలని సూచించారు.

ఒక పరీక్ష సరిగ్గా రాయకుంటే మన జీవితం అంతటితో ఆగిపోదని అన్నారు. పరీక్షల తర్వాత ఎంతో జీవితం ఉందని వ్యాఖ్యానించారు. పరీక్షల భయంతో ఏదైనా చేసుకుంటే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎంత క్షోభిస్తారో గుర్తుంచుకోవాలని అన్నారు. పరీక్షల వంటి చిన్న చిన్న అంశాలను దాటుకుంటూ వెళితే జీవితంలో పెద్ద పెద్ద వాటిని సులభంగా ఎదుర్కోవచ్చని అన్నారు.

K Kavitha
K Kavitha Telangana
Telangana Inter Exams
Inter Exams 2024
Telangana Jagruthi

More Telugu News