వైసీపీని, జగన్ ను హిందువులకు దూరం చేసే కుట్ర జరుగుతోంది: మల్లాది విష్ణు

తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేశారని, రాష్ట్రానికి పెద్దగా, బాధ్యతగా ఉండాల్సిన వ్యక్తి స్థానానికి ఇది తగదని వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదాన్ని రాజకీయాలకు వాడుకోవడం దుర్మార్గమని అన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 


లడ్డూ తయారీకి వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని సీబీఐ సిట్ చార్జ్ షీట్ లో తెలిపిందని విష్ణు అన్నారు. తప్పుడు ప్రచారం చేసినందుకు కూటమి నేతలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీని, జగన్ ను హిందువులకు దూరం చేసేందుకు కుట్ర పన్నారని... సీబీఐ రిపోర్టు వచ్చినా జగన్ పై బురద చల్లడం మానుకోలేదని దుయ్యబట్టారు. నెయ్యి వ్యవహారంపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ ప్రభుత్వ కనుసన్నల్లోనే ఉంటుందని... వారికి తగ్గట్టుగానే రిపోర్టు ఇస్తుందని అన్నారు. 


శాసనమండలిలో ఇందాపూర్, భోలేబాబా, హెరిటేజ్‌పై చర్చకు వైసీపీ తీర్మానం ఇచ్చినా కూటమి ప్రభుత్వం ఎందుకు తోక ముడిచిందో సమాధానం చెప్పాలని విష్ణు డిమాండ్ చేశారు. జంతువుల కొవ్వు, బాత్ రూమ్ కెమికల్స్ కలిపారని ఏ ఆధారాలతో మాట్లాడారో చెప్పాలని అన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారో కూడా వివరణ ఇవ్వాలని అడిగారు.


Malladi Vishnu
YS Jagan
YSRCP
Chandrababu Naidu
Tirumala Laddu
Animal Fat
Andhra Pradesh Politics
CBI
TDP
Hindu

More Telugu News