Chandrababu Naidu: ఆ రోజు త్వరలోనే వస్తుంది: ఢిల్లీ ఏఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Foresees Quantum Valley in Amaravati AI Hub in Vizag
  • ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026'లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌
  • అమరావతి క్వాంటం వ్యాలీగా మారుతుందని ధీమా వ్యక్తం చేసిన సీఎం
  • గూగుల్ రాకతో విశాఖ ఏఐ డేటా హబ్‌గా ఎదుగుతుందని వెల్లడి
  • క్వాంటం కంప్యూటింగ్ పరికరాలు తయారు చేసేలా ఏపీలో ఎకోసిస్టం
  • ప్రధాని మోదీ ఆశయాలకు అనుగుణంగా దేశాన్ని ముందుకు తీసుకెళతామని స్పష్టీకరణ
ఆంధ్రప్రదేశ్‌ను టెక్నాలజీ రంగంలో ప్రపంచ పటంలో నిలబెట్టడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తన దార్శనికతను ఆవిష్కరించారు. సమీప భవిష్యత్తులోనే అమరావతి 'క్వాంటం వ్యాలీ'గా, విశాఖపట్నం 'ఏఐ డేటా హబ్'గా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టాలన్న ప్రధాని మోదీ ఆకాంక్షకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ తన వంతు పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు.

ఢిల్లీలోని భారత్ మండపంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహిస్తున్న 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026'లో భాగంగా శుక్రవారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. 'కృత్రిమ మేధస్సు ద్వారా పోటీతత్వం' అనే అంశంపై జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సీఈఓ బోర్కే బ్రెండేతో కలిసి ఆయన ప్రసంగించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. "త్వరలోనే అమరావతి క్వాంటం వ్యాలీ గురించి ప్రపంచం అంతా మాట్లాడే రోజు వస్తుంది. కేవలం వినియోగించుకోవడమే కాకుండా, ప్రపంచానికి క్వాంటం కంప్యూటింగ్‌కు సంబంధించిన పరికరాలను తయారు చేసి, ఎగుమతి చేసేలా ఇక్కడ ఒక ప్రత్యేకమైన క్వాంటం ఎకో సిస్టంను రూపొందిస్తున్నాం" అని వివరించారు. గూగుల్ వంటి దిగ్గజ సంస్థల రాకతో విశాఖపట్నం ఒక కీలకమైన ఏఐ డేటా హబ్‌గా మారుతుందని తెలిపారు.

పౌరులందరికీ ప్రయోజనం కలిగేలా 'సావరిన్ ఏఐ'ని వినియోగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, డీప్ టెక్నాలజీ రంగంలో ఏపీని మరింత ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే స్పేస్, డ్రోన్, ఎలక్ట్రానిక్స్, మెడ్‌టెక్ పార్క్ వంటి ప్రత్యేక పారిశ్రామిక క్లస్టర్లు ఉన్నాయని, ఈ రంగాల్లో భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతాలు సాధిస్తుందన్న పూర్తి విశ్వాసం తనకు ఉందని, ఈ సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముందుంటుందని ఆయన పునరుద్ఘాటించారు.
Chandrababu Naidu
Andhra Pradesh
AI Summit
Amaravati Quantum Valley
Visakhapatnam AI Data Hub
Artificial Intelligence
WEF
World Economic Forum
India AI Impact Summit 2026
Ashwini Vaishnaw

More Telugu News