Atchannaidu: జగన్ రెడ్డి గారూ... బడ్జెట్ గురించి, విమానాల గురించి మీరు మాట్లాడడమా?: మంత్రి అచ్చెన్నాయుడు

Atchannaidu Slams Jagan Reddy on Budget and Flight Comments
షార్ట్స్‌లో చూడండి
ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ నిర్వహించిన మీడియా సమావేశంపై అధికార కూటమి నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ మాటలు 'దెయ్యాలు వేదాలు వల్లించినట్లు' ఉన్నాయని, అబద్ధాలకు ఆయనే బ్రాండ్ అంబాసిడర్ అని మంత్రి అచ్చెన్నాయుడు ఘాటుగా విమర్శించారు. బడ్జెట్, విమాన ప్రయాణాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు.

ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రాని సంగతి, తన సొంత పనుల కోసం ప్రజాధనాన్ని విమానాలకు దుర్వినియోగం చేసిన సంగతి రాష్ట్ర ప్రజలకు తెలుసని గుర్తుచేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, పెట్టుబడులను ఆకర్షించడం కోసం తాము చేస్తున్న పర్యటనలను 'జల్సాలు'గా అభివర్ణించడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు.

గత ఐదేళ్ల పాలనలో గారడీ లెక్కలతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి, ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసింది జగన్ కాదా? అని ప్రశ్నించారు. ఇప్పుడు తాము పారదర్శకంగా ముందుకెళుతుంటే, తప్పుడు లెక్కలతో ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. 

సూపర్ సిక్స్ పథకాల అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, 'బటన్ నొక్కడం' పేరుతో ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో ప్రజల ముక్కు పిండి వసూలు చేసే రకం తమది కాదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ప్రతి పైసా నేరుగా పేదవాడికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తిరుమల లడ్డూ ప్రసాదం టెండర్ల విషయంలో జరిగిన అపచారంపై సమాధానం చెప్పలేక, ప్రజల దృష్టిని మరల్చడానికే జగన్ కొత్త డ్రామాలకు తెరలేపారని విమర్శించారు. 

11 సీట్లకు పరిమితమైనా ఆయనలో అహంకారం కొంచెం కూడా తగ్గలేదని, అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించే ధైర్యం లేక మీడియా ముందు సాకులు చెబుతూ ఏడవడం మానుకోవాలని హితవు పలికారు. ప్రజలు తమ తీర్పుతో ఎవరి స్థానం ఎక్కడో చూపించారని, ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని అచ్చెన్నాయుడు సూచించారు.
Go Back to Shorts
Atchannaidu
Jagan Reddy
Andhra Pradesh
YS Jagan
TDP
Budget
Flights
Super Six Schemes
Tirumala Laddu
Andhra Pradesh Politics

More Telugu News