Vangalapudi Anitha: పాలు లేకుండా నెయ్యి తీసే టెక్నాలజీ తాడేపల్లి ప్యాలెస్‌లో ఉందేమో!: జగన్‌పై మంత్రి అనిత సెటైర్

Vangalapudi Anitha Slams Jagan Over TTD Ghee Allegations
  • టీటీడీ నెయ్యి సరఫరాపై జగన్ ఆరోపణలకు మంత్రి అనిత కౌంటర్
  • హెరిటేజ్‌కు, ఇందాపూర్ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టీకరణ
  • సాక్షి పేపర్, భారతీ సిమెంట్ ధరలు పెరిగిన విషయాన్ని గుర్తుచేసిన అనిత
  • వైవీ సుబ్బారెడ్డి హయాంలోనే నెయ్యి కల్తీ జరిగిందని తీవ్ర ఆరోపణలు
  • కల్తీని వదిలేసి హెరిటేజ్‌పై బురద జల్లడమేంటని జగన్‌పై ఫైర్
తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) నెయ్యి సరఫరా అంశంలో వైసీపీ అధినేత జగన్ ఇవాళ మీడియా సమావేశంలో చేసిన ఆరోపణలపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసలు సమస్య అయిన కల్తీని పక్కనపెట్టి, సంబంధం లేని హెరిటేజ్ సంస్థపై జగన్ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె, జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.

హెరిటేజ్‌కు, ఇందాపూర్‌కు సంబంధమే లేదు 
జగన్ ఆరోపిస్తున్నట్లుగా హెరిటేజ్‌కు, ఇందాపూర్ కంపెనీకి ఎలాంటి యాజమాన్య సంబంధం లేదని అనిత స్పష్టం చేశారు. ఇందాపూర్ అనేది బల్క్ మార్కెటింగ్ చేసే సంస్థ అని, అది చీజ్, పన్నీర్, టెట్రాప్యాక్ పాలు వంటి ఉత్పత్తులను తయారు చేసి హెరిటేజ్ వంటి కంపెనీలకు విక్రయిస్తుందని వివరించారు. హెరిటేజ్ సంస్థ నేరుగా వినియోగదారులకు మాత్రమే నెయ్యిని విక్రయిస్తుందని, ఎన్నడూ బల్క్‌గా ట్యాంకర్ల ద్వారా ఇతర కంపెనీలకు సరఫరా చేయలేదని తెలిపారు. "హెరిటేజ్ నుంచి ఇందాపూర్‌కు నెయ్యి వెళ్లి, అక్కడి నుంచి టీటీడీకి వస్తుందని చెప్పడానికి కనీసం బుర్ర పనిచేస్తుందా?" అని ఆమె ఎద్దేవా చేశారు. హెరిటేజ్ సంస్థ తన సిద్ధాంతాల ప్రకారం దేవాలయాలకు బల్క్‌గా సరఫరా చేయదని, ఈ విషయం చిన్నపిల్లవాడిని అడిగినా చెబుతాడని అన్నారు.

ధరల పెరుగుదలపై చిన్న లాజిక్ మిస్సయ్యారు 
2015లో రూ.280 ఉన్న నెయ్యి ధర, 2026 నాటికి రూ.650కి ఎందుకు పెరిగిందని జగన్ ప్రశ్నించడాన్ని అనిత తప్పుబట్టారు. కాలంతో పాటు ధరలు పెరగడం సహజమని, ఈ చిన్న లాజిక్‌ను జగన్ ఎలా విస్మరించారని ఆమె ప్రశ్నించారు. "మీరు సాక్షి పేపర్ ప్రారంభించినప్పుడు దాని ధర రూ.2, ఇప్పుడు రూ.6.50. భారతీ సిమెంట్ బస్తా ధర రూ.250 నుంచి రూ.450కి పెరిగింది. 2015లో రూ.19 ఉన్న పాల ప్యాకెట్ ఇప్పుడు రూ.40కి చేరింది. పాల ధర పెరిగితే నెయ్యి ధర పెరగదా? బహుశా పాలు లేకుండానే నెయ్యి తయారుచేసే టెక్నాలజీ మీ తాడేపల్లి ప్యాలెస్‌లో ఉందేమో" అని ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కర్ణాటకలో పాల ధరలు అధికంగా ఉండటం వల్లే నందిని డైరీ టీటీడీకి రూ.700కు నెయ్యి సరఫరా చేసిందని, ఆ విషయం గురించి జగన్ ఎందుకు మాట్లాడరని నిలదీశారు.

అసలు దొంగ మీ బాబాయే
అసలు సమస్య అయిన నెయ్యి కల్తీ గురించి మాట్లాడకుండా, జగన్ సంబంధం లేని హెరిటేజ్ అంశాన్ని తెరపైకి తెస్తున్నారని అనిత ఆరోపించారు. నెయ్యి కల్తీ జగన్ ప్రభుత్వ హయాంలో, ఆయన బాబాయి వైవీ సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్‌గా ఉన్నప్పుడే జరిగిందని అనిత తీవ్ర ఆరోపణలు చేశారు. "నెయ్యిలో రసాయనాలు కలిశాయని సిట్, ఎన్డీబీ రిపోర్టులు స్పష్టంగా తేల్చాయి. కల్తీ జరిగిందని నిర్ధారణ అయ్యాక కూడా అప్పటి మీ ప్రభుత్వం ఆ కంపెనీ టెండర్‌ను ఎందుకు రద్దు చేయలేదు? ఎందుకు ఆ సంస్థను బ్లాక్‌లిస్టులో పెట్టలేదు?" అని ఆమె సూటిగా ప్రశ్నించారు. కల్తీ జరిగిందని చార్జ్‌షీట్‌లో ఉన్నా, మీ బాబాయి స్వయంగా అంగీకరించినా దాని గురించి మాట్లాడకుండా, ముక్కు ఎక్కడ ఉందంటే చుట్టూ తిప్పి చూపినట్లు హెరిటేజ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

టెండర్ నిబంధనలు మార్చిందెవరు?
 కేవలం తమకు నచ్చిన కంపెనీలకు లబ్ధి చేకూర్చేందుకే జగన్ ప్రభుత్వం టెండర్ నిబంధనలను నీరుగార్చిందని అనిత ఆరోపించారు. "ఒక చుక్క పాలు కూడా సేకరించని కంపెనీలు కూడా నెయ్యి సరఫరా చేసేలా నిబంధనలను మార్చారు. రూ.250 కోట్ల టర్నోవర్‌ను రూ.150 కోట్లకు తగ్గించారు. ఇవన్నీ ఎవరికోసం చేశారు? కల్తీపై చర్చకు మేము సిద్ధం. ఆధారాలు చూపించమన్నందుకే ప్రజలకు ఈ వాస్తవాలు వివరిస్తున్నాం. దమ్ముంటే కల్తీ గురించి మాట్లాడండి" అని జగన్‌కు ఆమె సవాల్ విసిరారు.
Vangalapudi Anitha
Jagan Mohan Reddy
TTD
Heritage Foods
Ghee Adulteration
Andhra Pradesh Politics
YS Subba Reddy
TDP
Tirumala Tirupati Devasthanam
Ghee Price Hike

More Telugu News