Atchannaidu: బొత్స గారూ... మీకు చీజ్‌కు, నెయ్యికి తేడా తెలియదా?: అచ్చెన్నాయుడు

Atchannaidu Slams Botsa Over Cheese Ghee Confusion in Assembly
  • మండలిలో హెరిటేజ్‌పై వైసీపీ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన మంత్రి అచ్చెన్నాయుడు
  • చీజ్ ప్యాకెట్లు చూపి నెయ్యి అని ప్రచారం చేస్తున్నారని బొత్సపై విమర్శలు
  • హెరిటేజ్‌పై ఒక్క ఆధారమైనా చూపాలని, లేదంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్
  • అసత్య ఆరోపణలపై హెరిటేజ్ ఇప్పటికే లీగల్ నోటీసులు ఇచ్చిందని వెల్లడి
  • ప్రతిష్ఠాత్మక సంస్థలపై దాడి చేయడం వైసీపీ ఫ్యాక్షన్ మనస్తత్వానికి నిదర్శనమని వ్యాఖ్య
హెరిటేజ్ సంస్థపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. చీజ్ ప్యాకెట్లు చేతిలో పట్టుకుని, వాటిని నెయ్యి అని చూపిస్తూ ప్రజలను, సభను తప్పుదోవ పట్టిస్తున్నారని, వైసీపీ నేతలకు కనీస అవగాహన ఉందా అని శాసనమండలిలో నిలదీశారు. మండలిలో వైసీపీ సభ్యుల తీరు అత్యంత బాధ్యతారాహిత్యంగా ఉందని ఆయన విమర్శించారు.

ఇందాపూర్ డెయిరీకి, హెరిటేజ్ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని గత రెండు రోజులుగా తాను స్పష్టంగా సమాధానం ఇస్తున్నప్పటికీ, అదే అంశాన్ని పట్టుకుని సభా సమయాన్ని వృథా చేయడం దుర్మార్గమని అచ్చెన్నాయుడు అన్నారు. ముఖ్యంగా మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణను ఉద్దేశించి, "చీజ్ ప్యాకెట్లను చూపిస్తూ నెయ్యి ప్యాకెట్లు అంటూ ప్రజలను మోసం చేస్తున్నారు. మీకు చీజ్‌కు, నెయ్యికి మధ్య తేడా కూడా తెలియదా?" అని ఎద్దేవా చేశారు. హెరిటేజ్‌పై అంతగా అనుమానాలు ఉంటే ఒక్కటంటే ఒక్క చిన్న ఆధారాన్నైనా సభ ముందు పెట్టాలని, లేనిపక్షంలో బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ అసత్య ప్రచారాలపై హెరిటేజ్ సంస్థ ఇప్పటికే వైసీపీ నేతలకు లీగల్ నోటీసులు పంపిందని, వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వారిపై ఉందని అచ్చెన్నాయుడు గుర్తుచేశారు. "గతంలో రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలతో పచ్చని తోటలు నరికించినట్లు, ఇప్పుడు ప్రతిష్ఠాత్మక సంస్థల ఆర్థిక మూలాలపై దాడి చేయాలని చూడటం మీ ఫ్యాక్షన్ మనస్తత్వానికి నిదర్శనం" అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వాలను అడ్డం పెట్టుకుని భారతి సిమెంట్ పేరుతో ప్రభుత్వ ధనాన్ని దోచుకున్న చరిత్ర వైసీపీదని, కానీ హెరిటేజ్ సంస్థ ప్రభుత్వాలతో సంబంధం లేకుండా పారదర్శకంగా వ్యాపారం చేయాలనే చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న సంస్థ అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. నిత్యం వాయిదా తీర్మానాలతో సభను పక్కదారి పట్టించడం మానేసి, దమ్ముంటే ఆధారాలతో మాట్లాడాలని, నిర్మాణాత్మక చర్చకు రావాలని వైసీపీకి ఆయన సవాల్ విసిరారు.


Atchannaidu
Botsa Satyanarayana
Heritage Foods
Andhra Pradesh Assembly
Cheese vs Ghee
YSRCP Allegations
Indapur Dairy
Legal Notice
Bharati Cement
Political Debate

More Telugu News