మేం కూడా లడ్డూపై చర్చిద్దామనే కోరుతున్నాం: బొత్స సత్యనారాయణ
- తిరుమల లడ్డూపై శాసనమండలిలో చర్చించాలన్న బొత్స సత్యనారాయణ
- ఇందాపూర్, హెరిటేజ్‌పై చర్చించాల్సిందే అని డిమాండ్
- వాస్తవాలను తేల్చడానికి చర్చకు రావాలన్న బొత్స
ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు గుప్పించారు. మండలి మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ... తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని అసత్య ప్రచారం చేస్తున్నారని, సీబీఐ దర్యాప్తులో ఎలాంటి కొవ్వు లేదని తేలిందని ఆయన అన్నారు.
“ఇందాపూర్ ద్వారా దోచుకోవాలనేది చంద్రబాబు దుర్బుద్ధి. హోంమంత్రి వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు. మేం కూడా వాస్తవాలు తేల్చాలనే తిరుమల లడ్డూపై మండలిలో చర్చిద్దామని కోరుతున్నాం. ఇందాపూర్‌తో హెరిటేజ్ సంస్థ చీకటి ఒప్పందం చేసుకుంది. సభలో బడ్జెట్‌తో పాటు ఇందాపూర్, హెరిటేజ్‌పై చర్చించాల్సిందే” అని బొత్స అన్నారు.
తాము చెబుతున్న దాంట్లో అవాస్తవాలు ఉంటే వాస్తవాలను తేల్చడానికి చర్చకు రావాలని బొత్స సవాల్ విసిరారు. ఆధారాలతో సహా తాము నిరూపిస్తామని చెప్పారు. రూ.320కి కొనుగోలు చేసే నెయ్యిని రూ.700కి పెంచడం వెనుక ఉన్న కారణం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు చిత్తశుద్ధి ఉంటే చర్చకు రావాలని అన్నారు. వీళ్లు చేస్తున్న దోపిడీని బీజేపీ నేతలు సమర్థిస్తారా? అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వానికి అధికారంలో ఉండే నైతికత లేదని అన్నారు.
గతంలో తిరుమల లడ్డూ ఇస్తే భక్తులు కళ్లకు అద్దుకుని తినేవారని, ఇప్పుడు లడ్డూ ఇస్తే పరిశీలించి చూసి తింటున్నారని బొత్స చెప్పారు. మంత్రి నారా లోకేశ్ తెలిసీ తెలియక మాట్లాడుతున్నారని విమర్శించారు. తాము పట్టుకోల్పోయామనే భావనలో ఆయన ఉంటే ఉండనివ్వాలని... తమకు ఎలాంటి నష్టం లేదని అన్నారు.