Jagan Mohan Reddy: మండలిలో రభస చేయించి జగన్ ఇంట్లో నవ్వుకుంటున్నారు: జనసేన ఎమ్మెల్యేల విమర్శలు

Janasena MLAs Criticize Jagan for Disruption in AP Legislative Council
  • బడ్జెట్‌పై చర్చను పక్కదారి పట్టించేందుకే మండలిలో వైసీపీ రభస అంటూ ఫైర్
  • చైర్మన్ పోడియం ఎక్కిన వైసీపీ ఎమ్మెల్సీల తీరును తీవ్రంగా ఖండించిన జనసేన
  • ప్రజా సమస్యలపై చర్చించే ఉద్దేశం వైసీపీకి లేదని విమర్శలు
రాష్ట్ర బడ్జెట్‌పై చర్చ జరగకుండా ఉండేందుకే వైసీపీ శాసనమండలిలో ఉద్దేశపూర్వకంగా గందరగోళం సృష్టిస్తోందని జనసేన ఎమ్మెల్యేలు తీవ్రంగా ఆరోపించారు. తమ పార్టీ ఎమ్మెల్సీలతో మండలిలో రభస చేయించి, చైర్మన్ పోడియం ఎక్కించి మరీ సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తూ వైసీపీ అధినేత జగన్ ఇంట్లో కూర్చొని నవ్వుకుంటూ వికృతానందం పొందుతున్నారని వారు విమర్శించారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ మాట్లాడారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ.. "అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకొని, అన్ని రంగాలను అభివృద్ధి పథంలో నడిపించేలా రాష్ట్ర బడ్జెట్ ఉంది. పోలవరం, అమరావతి వంటి ప్రాజెక్టులకు, బీసీ వర్గాలకు రూ.50 వేల కోట్లకు పైగా కేటాయింపులు చేయడం చారిత్రాత్మకం. ఇంతటి కీలకమైన బడ్జెట్‌పై చర్చించే ఓపిక, ధైర్యం లేక వైసీపీ తన సంఖ్యా బలంతో మండలిలో గొడవకు దిగింది. జగన్‌కు గొడవ, గోల లేకపోతే నిద్ర పట్టదు. అందుకే విలువైన సభా సమయాన్ని వృథా చేస్తున్నారు" అని మండిపడ్డారు.

పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ.. "అసెంబ్లీకి రాని వారు, మండలిలో సమయం ఉన్నా చర్చించకుండా పక్కదారి పట్టిస్తున్నారు. వారికి ప్రజా సమస్యలు పట్టవు, కేవలం రభస చేయడమే కావాలి. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా సమగ్ర బడ్జెట్ రూపొందిస్తే, దానిపై మాట్లాడలేక సభలో రచ్చ చేస్తున్నారు. చైర్మన్ పోడియం ఎక్కిన వైసీపీ సభ్యుల అప్రజాస్వామిక తీరును జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది" అని స్పష్టం చేశారు.
Jagan Mohan Reddy
YS Jagan
Janasena
AP Assembly
Andhra Pradesh Budget
Legislative Council
Vamsikrishna Srinivas
Nimmaka Jayakrishna
TDP
Political News

More Telugu News