Balka Suman: మా మహిళా కౌన్సిలర్ల పట్ల దుశ్శాసన పర్వం.. రేపు సీపీఐతో కలిసి క్యాతనపల్లి బంద్‌కు పిలుపు: బాల్క సుమన్

Balka Suman Calls for Kyathanpalli Bandh Over Councillor Incident
  • కాంగ్రెస్ కౌన్సిలర్లు తమ సోదరీమణుల మీద దౌర్జన్యం చేశారని ఆగ్రహం
  • మంత్రి, ఎంపీ దగ్గరుండి చేయించారని బాల్క సుమన్ మండిపాటు
  • తమ మహిళా కౌన్సిలర్ల కంటే ఛైర్మన్ పదవి ఎక్కువ కాదన్న బాల్క సుమన్
కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది కౌన్సిలర్లు తాగి వచ్చి తమ మహిళా కౌన్సిలర్ సోదరీమణులను తాకరాని చోట తాకారని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు బాల్క సుమన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంత్రి వివేక్, ఎంపీ వంశీ అక్కడ కూర్చుని మా సోదరీమణుల మీద దౌర్జన్యం చేయిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఇంట్లో ఆడకూతుళ్లు లేరా నిలదీశారు. తాను రౌడీయిజం చేయలేదని, మంత్రి, ఎంపీలే రౌడీయిజం చేశారని ఆరోపించారు. మంత్రి, ఎంపీ తీరుకు నిరసనగా బీఆర్ఎస్, సీపీఐ కలిసి క్యాతనపల్లి మున్సిపాలిటీ బంద్‌కు పిలుపునిస్తున్నామని అన్నారు.

క్యాతనపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా పడిన నేపథ్యంలో బాల్క సుమన్ సీపీఐ నాయకులు, కౌన్సిలర్లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఒక మున్సిపల్ ఛైర్మన్ పదవి కోసం ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారా, సిగ్గుండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీరు విజ్ఞప్తి చేస్తే ఛైర్మన్ పదవిని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేందుకు సిద్ధమే అన్నారు. తమ ఆడకూతుళ్ల కంటే మున్సిపల్ ఛైర్మన్ పదవి తమకు ఎక్కువ ఏమీ కాదని అన్నారు. వివేక్ కుటుంబం ఎన్ని పదవులు అనుభవించింది, ఈ ప్రాంతంలో వారికి ఎంత గౌరవం ఉంది, కానీ ఇప్పుడు ఇంత దిగజారి ప్రవర్తించడమేమిటని ధ్వజమెత్తారు. ఇంత అనైతిక చర్యలకు పాల్పడమేమిటని ప్రశ్నించారు. రేపు బంద్‌కు అందరూ మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు

పోలీసులపై ఆగ్రహం

పోలీసుల తీరుపై బాల్క సుమన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా ప్రవర్తించారని ఆరోపించారు. ఇక ఖాకీ దుస్తులు అవసరం లేదు, కాంగ్రెస్ రంగు దుస్తులు వేసుకుని, రేవంత్ రెడ్డి పాటలు పెట్టుకుని డ్యాన్స్ చేసుకోండని వ్యాఖ్యలు చేశారు. తమపై ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోవాలని అన్నారు. ప్రజల పక్షాన, సింగరేణి కార్మికుల పక్షాన, రైతుల పక్షాన ప్రతిపక్ష నాయకుడిగా తాను పోరాటం చేస్తానని అన్నారు. 

క్యాతనపల్లి మున్సిపాలిటీలో 22 వార్డులు ఉండగా, బీఆర్ఎస్ 10, కాంగ్రెస్ 7, సీపీఐ 4, స్వతంత్రులు ఒక స్థానాన్ని గెలుచుకున్నారు. అయితే రెండు ఎక్స్ అఫీషియో సభ్యులు, స్వతంత్ర అభ్యర్థి మద్దతుతో కాంగ్రెస్ బలం 10కి చేరుకుంది. దీంతో క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నిక ఉత్కంఠగా మారింది. అయితే ఉద్రిక్తతల నేపథ్యంలో కోరం లేదని చెబుతూ క్యాతనపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికను అధికారులు వాయిదా వేశారు.
Balka Suman
Kyathanpalli Bandh
BRS
CPI
Congress Councillors
Vivek Venkataswamy
Kyathanpalli Municipality Election

More Telugu News