Bill Gates: "హలో ఫ్రెండ్...! హౌ ఆర్ యూ..?" అంటూ చంద్రబాబును ఆత్మీయంగా పలకరించిన బిల్ గేట్స్

Bill Gates and Chandrababu Naidu Meet in Amaravati
  • అమరావతి పర్యటనకు వచ్చిన బిల్ గేట్స్‌కు సీఎం చంద్రబాబు ఆత్మీయ స్వాగతం
  • ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించి టెక్నాలజీ వినియోగంపై గేట్స్ ప్రశంసలు
  • స్వర్ణాంధ్ర విజన్ 2047పై ప్రజెంటేషన్.. కీలక రంగాల్లో భాగస్వామ్యంపై చర్చ
  • 1997 నాటి తమ స్నేహాన్ని, హైదరాబాదులో మైక్రోసాఫ్ట్ ఏర్పాటును గుర్తు చేసుకున్న వైనం
"హలో ఫ్రెండ్...! హౌ ఆర్ యూ..?" అంటూ మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆత్మీయంగా పలకరించారు. ఇద్దరు పాత మిత్రుల కలయికతో అమరావతి సచివాలయంలో సోమవారం సందడి వాతావరణం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కీలక భాగస్వామ్యంపై చర్చించేందుకు రాష్ట్ర పర్యటనకు వచ్చిన బిల్ గేట్స్‌కు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఘన స్వాగతం పలికారు. సచివాలయం మొదటి బ్లాకు వద్ద చంద్రబాబును చూడగానే బిల్ గేట్స్ స్నేహపూర్వకంగా ముందుకు వచ్చి ఆయన్ను పలకరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది.

అంతకుముందు, గన్నవరం విమానాశ్రయం చేరుకున్న బిల్ గేట్స్‌కు రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్, మంత్రులు అచ్చెన్నాయుడు, అనిత, సత్యకుమార్‌లతో పాటు కృష్ణా జిల్లా కలెక్టర్, ఎస్పీ ఘనంగా స్వాగతం పలికారు. సచివాలయానికి చేరుకున్న అనంతరం చంద్రబాబు తన మంత్రివర్గ సహచరులను, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ను బిల్ గేట్స్‌కు పరిచయం చేశారు.

టెక్నాలజీతో పాలనపై బిల్ గేట్స్ ప్రశంసలు

సమావేశానికి ముందు సీఎం చంద్రబాబుతో కలిసి బిల్ గేట్స్ సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీఎస్) కేంద్రాన్ని సందర్శించారు. పాలనలో టెక్నాలజీని వినియోగిస్తున్న తీరును చూసి ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. డేటా లేక్, అవేర్ 2.0, వాట్సప్ గవర్నెన్స్ వంటి వినూత్న విధానాల ద్వారా పౌర సేవలను వేగంగా అందిస్తున్న తీరును చంద్రబాబు ఆయనకు వివరించారు. ముఖ్యంగా, బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో భూ రికార్డులను భద్రపరచడం, ట్యాక్స్ కలెక్షన్ ప్రక్రియ అద్భుతంగా ఉన్నాయని బిల్ గేట్స్ ప్రశంసించారు.

తమ ఫౌండేషన్ సహకారంతో చిత్తూరు జిల్లా కుప్పంలో నడుస్తున్న 'సంజీవని' ప్రాజెక్టు పనితీరును అడిగి తెలుసుకుని, "దట్స్ నైస్" అంటూ అభినందించారు. ఏఐ వినియోగంతో ప్రజారోగ్య సేవలను మెరుగుపరుస్తున్నామని సీఎం చెప్పగా, "గ్రేట్" అంటూ కితాబిచ్చారు. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ ప్రణాళికలో 30 శాతం పచ్చదనం, జల వనరులకు కేటాయించడం బాగుందని, ఇది "గ్రేట్ వర్క్" అని కొనియాడారు.

స్వర్ణాంధ్ర విజన్ 2047.. వ్యూహాత్మక భాగస్వామ్యం

అనంతరం మంత్రులు, ఉన్నతాధికారులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు 'స్వర్ణాంధ్ర విజన్ 2047'పై బిల్ గేట్స్‌కు ప్రజెంటేషన్ ఇచ్చారు. 1997లో తాను తొలిసారి బిల్ గేట్స్‌ను కలిసినప్పటి నుంచి తమ మధ్య ఉన్న అనుబంధాన్ని, ఆయన సహకారంతో హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు జరిగిన విధానాన్ని గుర్తు చేసుకున్నారు. "నాడు మైక్రోసాఫ్ట్ రాకతో హైదరాబాద్ ఐటీ రంగంలో మేటిగా నిలిచింది. ఇప్పుడు అదే స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్‌లో సంపద సృష్టి జరగాల్సి ఉంది. బిల్ గేట్స్ సహకారంతో వ్యవసాయం, ప్రజారోగ్యం, టెక్నాలజీ రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తాం" అని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

డేటా-ఏఐ సిటీగా విశాఖ, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా కాకినాడ, డ్రోన్ సిటీగా ఓర్వకల్లు వంటి నగరాలను అభివృద్ధి చేసే ప్రణాళికలను వివరించారు. విద్య, వైద్య రంగాల్లో సాంకేతికతను జోడించి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు. బిల్ గేట్స్ పర్యటన చారిత్రాత్మకమని, ఇది రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేస్తుందని సీఎం అన్నారు.
Bill Gates
Chandrababu Naidu
Andhra Pradesh
Pawan Kalyan
Microsoft
Amaravati
Real Time Governance
Vizag
Kakinada
Nara Lokesh

More Telugu News