పాక్‌తో మ్యాచ్‌కు అభిషేక్ డౌటే.. టీమిండియాలో టెన్షన్!

  • టీ20 ప్రపంచకప్‌లో పాక్‌తో మ్యాచ్‌కు అభిషేక్ శర్మ దూరం?
  • కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరిన భారత ఓపెనర్
  • నమీబియాతో మ్యాచ్‌కు దూరమైన అభిషేక్ శర్మ
  • ఒకట్రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడన్న సూర్యకుమార్
  • బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నట్టు ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ అనారోగ్యం కారణంగా కీలకమైన పాకిస్థాన్ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడా? లేదా? అనే దానిపై సందిగ్ధత నెలకొంది. కడుపు ఇన్ఫెక్షన్ కారణంగా నమీబియాతో గురువారం జరిగిన మ్యాచ్‌కు అతను దూరమయ్యాడు. ప్రస్తుతం కోలుకుంటున్నప్పటికీ, పాక్‌తో మ్యాచ్ నాటికి పూర్తి ఫిట్‌నెస్ సాధించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కడుపు నొప్పి, డీహైడ్రేషన్ సమస్యలతో ఢిల్లీలోని ఆసుపత్రిలో చేరిన అభిషేక్, చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యాడు. ప్రస్తుతం అతడు బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో కోలుకుంటున్నట్టు బోర్డు అధికారికంగా ప్రకటించింది. నమీబియాతో మ్యాచ్‌కు సెలక్షన్‌కు అందుబాటులో లేడని స్పష్టం చేసింది.

ఈ విషయంపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. "అభిషేక్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు, అతడు ఒకటి లేదా రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉండవచ్చు" అని తెలిపాడు. దీంతో ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లోనూ అతను ఆడే అవకాశం తక్కువగా కనిపిస్తోంది. అయితే, సహచర ఆటగాడు వరుణ్ చక్రవర్తి మాత్రం.. అభిషేక్ పాక్‌తో మ్యాచ్ ఆడతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.

అమెరికాతో మ్యాచ్ తర్వాత అస్వస్థతకు గురైన అభిషేక్, ఢిల్లీకి చేరుకున్నాక పరిస్థితి తీవ్రమవ్వడంతో ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది. ప్రస్తుతం అతను జట్టుతోనే ఉన్నప్పటికీ, పాక్‌తో కీలక పోరు నాటికి పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడా? లేదా? అన్నది వేచి చూడాలి. నమీబియాతో మ్యాచ్‌లో అభిషేక్ స్థానంలో సంజూ శాంసన్ బరిలోకి దిగాడు.


More Telugu News