కేంద్ర మంత్రులను ఆపిన రాహుల్ గాంధీ.. వీడియో ఇదిగో!

  • పార్లమెంట్ మీడియా పాయింట్ లో ఆసక్తికర సన్నివేశం
  • మీడియాతో మాట్లాడుతున్న అశ్వినీ వైష్ణవ్, ప్రహ్లాద్ జోషి
  • అదే సమయంలో అక్కడికి వచ్చిన రాహుల్ గాంధీ
  • రాహుల్ రాకతో మధ్యలోనే వెళ్లిపోయిన కేంద్ర మంత్రులు
పార్లమెంట్ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద బుధవారం ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, ప్రహ్లాద్ జోషి మీడియాతో మాట్లాడుతుండగా రాహుల్ గాంధీ అక్కడికి రావడంతో వారు మధ్యలోనే వెళ్లిపోయారు. కలిసి మాట్లాడుదాం ఉండండంటూ రాహుల్ గాంధీ వారిని ఆపేందుకు ప్రయత్నించారు. అయినా ఆగకుండా వెళుతున్న ప్రహ్లాద్ జోషిని చేయిపట్టుకుని ఆపేందుకు ప్రయత్నించినా ఆయన విడిపించుకుని వెళ్లిపోయారు. ఇదంతా చూసి రాహుల్ గాంధీతో పాటు ఆయన వెన్నంటి ఉన్న సహచర ఎంపీలు నవ్వడం వీడియోలో కనిపిస్తోంది.

కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనటే ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. సభలో రాహుల్ గాంధీ అన్నీ అబద్ధాలే మాట్లాడారంటూ కేంద్ర మంత్రులు మీడియా ముందు ఆరోపించారని చెప్పారు. అప్పుడే అక్కడికి వచ్చిన రాహుల్ గాంధీ ఇదే విషయంపై కలిసి మాట్లాడుదామని అనగానే కేంద్రమంత్రులు అక్కడి నుంచి పలాయనం చిత్తగించారని విమర్శించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ప్రధానిపై ఒత్తిడి.. రాహుల్ గాంధీ
అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. ఎప్ స్టీన్ ఫైల్స్ లో హర్దీప్ సింగ్ పూరి, అనిల్ అంబానీల పేర్లు ఉన్నాయని చెప్పారు. ఈ విషయంలో ప్రధాని మోదీపై ఒత్తిడి తీసుకొచ్చారని, అందుకే ఆయన అమెరికా ట్రేడ్ డీల్ కు అంగీకరించారని ఆరోపించారు. లేదంటే ఏ ప్రధాన మంత్రి కూడా సాధారణంగా ఇలాంటి ట్రేడ్ డీల్ కు అంగీకరించరని విమర్శించారు. రైతులు, డేటా, ఎనర్జీ సెక్యూరిటీ.. తదితర ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఏ ప్రధాని కూడా ట్రేడ్ డీల్ కుదుర్చుకోరని రాహుల్ గాంధీ అన్నారు.


More Telugu News