ఆఫీసులో టాయిలెట్ లేదని... ప్రభుత్వ ఉద్యోగం వదిలేశాడు!

Saurabh Mittal Quits Government Job Due to Lack of Toilet Facilities
  • పనిచేసే చోట సరైన టాయిలెట్స్ లేవని, సెలవులు ఇవ్వడం లేదని రాజీనామా
  • సంవత్సరానికి రూ.19 లక్షలు వచ్చే బీపీసీఎల్ ఉద్యోగాన్ని విడిచిపెట్టిన సౌరభ్ మిట్టల్
  • తన కోసం కేటాయించిన కార్యాలయం గిడ్డంగిలా ఉందన్న సౌరభ్ మిట్టల్
ప్రభుత్వరంగ సంస్థలో ఉద్యోగం పొందడం ఎంతోమంది యువత గొప్ప విజయంగా భావిస్తారు. మంచి జీతం, ఉద్యోగ భద్రత, సమాజంలో గౌరవం ఉంటాయి. అయితే ఉద్యోగంలో పని ఒత్తిడి కంటే జీవితంలో మానసిక ప్రశాంతత, ఉద్యోగంలో సంతృప్తిని కోరుకుంటున్న యువత పెరుగుతోంది. తాను పనిచేసే చోట సరైన టాయిలెట్స్ లేవని, సెలవులు ఇవ్వడం లేదని 25 ఏళ్ళ ఇంజినీర్ సౌరబ్ మిట్టల్ రూ.19 లక్షల ఉద్యోగం వదులుకోవడం చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి ఆయన సామాజిక మాధ్యమాల్లో స్టోరీని పోస్టు చేశారు.

సౌరభ్ మిట్టల్ నిట్-కురుక్షేత్ర పూర్వ విద్యార్థి. భారత్ పెట్రోలియం (బీపీసీఎల్) సంస్థలో ఏడాదికి రూ.19 లక్షల ప్యాకేజీతో లభించిన ప్రతిష్ఠాత్మక ఉద్యోగాన్ని వదులుకున్నాడు. సౌరభ్ మిట్టల్ తన 22వ ఏట బీపీసీఎల్‌లో చేరాడు. ఎన్నో ఆశలతో, ఆశయాలతో ఉద్యోగంలో చేరినప్పటికీ, అక్కడి పని వాతావరణం, పరిస్థితులు ఆయన ఊహించిన దానికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. కనీస వసతుల్లేవు. తన పని కోసం కేటాయించిన కార్యాలయం గిడ్డంగిలా ఉందని సౌరభ్ తెలిపారు.

అక్కడ తాగడానికి నీళ్ళు లేవని, టాయిలెట్ కూడా లేదని చెబుతున్నారు. గదిలో ఏసీ చెడిపోతే తాను స్వయంగా బాగుచేసుకున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని తన మేనేజర్, హెచ్ఆర్, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళినా పరిష్కారం లభించలేదని అన్నారు. తన ఇల్లు 10 నిమిషాల నడక దూరంలో ఉండటంతో రోజుకు చాలాసార్లు ఇంటికి వెళ్ళేవారు. తాను ఉద్యోగం మానేసే వరకు పరిస్థితి ఇలాగే ఉందని చెప్పారు.

పనిలో కూడా బాగా ఒత్తిడి ఉండేదని, పాతకాలపు పద్ధతుల్లో పనులు సాగేవని చెప్పారు. అమ్మకాలు తగ్గినప్పుడు ఉద్యోగులు నేరుగా ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చేవారని, వీడియో కాన్ఫరెన్సులు, ఫోన్ కాల్స్ సమయంలో క్లాస్ తీసుకోవడం సర్వసాధారణమైనట్లు చెప్పారు. ఆఫీస్ వేళలు ముగిసిన తర్వాత కూడా అర్ధరాత్రి వరకు వీకెండ్స్‌లోనూ ఫోన్ కాల్స్ వస్తూనే ఉండేవని చెప్పారు. లీవ్‌లు కూడా దొరకలేదని అన్నారు.

తన చుట్టూ ఉన్న ఉద్యోగులు పెద్దవారు కావడంతో కొత్తగా నేర్చుకోవడానికి ఏదీ లేకపోయేదని అన్నారు. తన జీవితం మున్ముందు ఇలాగే కొనసాగడాన్ని తాను ఊహించుకోలేకపోయినట్లు చెప్పారు. తాను ఉద్యోగం వదులుకుంటానంటే తన తండ్రి నుంచి వ్యతిరేకత వచ్చిందని, కానీ తన పని ఒత్తిడిని చూసిన తల్లి మాత్రం నిర్మయానికి మద్దతు పలికినట్లు చెప్పారు. నెటిజన్లు కూడా చాలామంది ఆయనకు అనుకూలంగా స్పందించారు.
Go Back to Shorts
Saurabh Mittal
BPCL
Bharat Petroleum
Job dissatisfaction
Government job
NIT Kurukshetra

More Telugu News