Jaish-e-Mohammed: ఎర్రకోట దాడి వెనుక జైషే హస్తం.. మహిళలతో ప్రత్యేక వింగ్: ఐరాస సంచలన నివేదిక

పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహమ్మద్ (జేఈఎం) ఉగ్రవాద సంస్థపై ఐక్యరాజ్యసమితి (యూఎన్) సంచలన నివేదికను విడుదల చేసింది. గతేడాది ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన ఉగ్రదాడి వెనుక జైషే హస్తం ఉందని, ఆ సంస్థ మహిళలతో ప్రత్యేకంగా ఒక ఉగ్రవాద విభాగాన్ని కూడా ఏర్పాటు చేసిందని ఈ నివేదిక స్పష్టం చేసింది.

ఐరాస భద్రతా మండలికి చెందిన ఆల్-ఖైదా, ఐసిస్ ఆంక్షల పర్యవేక్షణ బృందం ఈ నివేదికను రూపొందించింది. 2025 నవంబర్ 9న ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన దాడిలో 15 మంది మరణించారని, ఈ ఘటనతో జైషే మహమ్మద్‌కు సంబంధం ఉన్నట్లు తమకు సమాచారం అందిందని పేర్కొంది. ఈ దాడితో పాటు మరికొన్ని దాడులకు జైషే బాధ్యత వహించినట్లు ఒక సభ్య దేశం తెలిపినట్లు నివేదికలో పొందుపరిచారు.

అంతేకాకుండా జైషే చీఫ్, అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజార్ 2025 అక్టోబర్ 8న 'జమాత్ ఉల్-ముమినత్' పేరుతో మహిళా విభాగాన్ని అధికారికంగా ప్రకటించినట్లు నివేదిక తెలిపింది. ఉగ్రవాద దాడులకు మద్దతు ఇవ్వడమే లక్ష్యంగా ఈ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.

అయితే, ఈ నివేదికలో మరో ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. ఒక సభ్య దేశం (పాకిస్థాన్ అని భావిస్తున్నారు) మాత్రం జైషే సంస్థ ఎప్పుడో 'నిర్వీర్యం' అయిపోయిందని వాదించింది. నివేదికలో జైషే ప్రస్తావనపై పాకిస్థాన్ తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు సమాచారం. పాకిస్థాన్ వాదన ఎలా ఉన్నప్పటికీ, జైషే మహమ్మద్ ఇప్పటికీ చురుకుగా కార్యకలాపాలు సాగిస్తోందని, అంతర్జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమించిందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.
Jaish-e-Mohammed
Red Fort attack
UN report
Masood Azhar
terrorism
Delhi
Pakistan
Jamat-ul-Muminat
terrorist group
India

More Telugu News