Jagan Mohan Reddy: జగన్ అక్రమాస్తుల కేసు.. సుప్రీంకోర్టులో వాన్‌పిక్‌కు నిరాశ

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల కేసులో వాన్‌పిక్‌ ప్రాజెక్ట్స్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తమపై సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ వాన్‌పిక్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం కొట్టివేసింది. ఈ విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.

జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. వాన్‌పిక్‌పై సీబీఐ మోపిన అభియోగాలకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, కింది కోర్టులో విచారణ ఎదుర్కోవాల్సిందేనని గతంలో తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ వాన్‌పిక్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమ వాదనలను హైకోర్టు సరిగా పరిగణనలోకి తీసుకోలేదని వాన్‌పిక్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

అయితే, ఈ వాదనలతో ధర్మాసనం ఏకీభవించలేదు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాతే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తుచేసింది. ప్రస్తుత దశలో ఈ కేసులో కలుగజేసుకోలేమని పేర్కొంటూ పిటిషన్‌ను తోసిపుచ్చింది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో వాన్‌పిక్‌ ప్రాజెక్టుకు భూ కేటాయింపులు, రాయితీల రూపంలో లబ్ధి చేకూర్చారని, అందుకు ప్రతిగా వాన్‌పిక్ ప్రమోటర్లు జగన్‌ కంపెనీలలో భారీగా పెట్టుబడులు పెట్టారని సీబీఐ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో వాన్‌పిక్‌పై హైదరాబాద్‌ సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ కొనసాగనుంది.
Jagan Mohan Reddy
YS Jagan
Vanpic
Vanpic Projects
CBI
Supreme Court
illegal assets case
Telangana High Court
corruption case

More Telugu News