Nakka Nagesu: బాపట్లలో హృదయ విదారకం.. డబ్బుల్లేక కన్నతండ్రి శవాన్ని బైక్‌పై తరలించిన కొడుకు

Bapatla Son carries fathers corpse on bike after being unable to afford transport
షార్ట్స్‌లో చూడండి
బాపట్ల జిల్లాలో మానవత్వాన్ని ప్రశ్నించే, హృదయాలను కలచివేసే ఘటన చోటుచేసుకుంది. కన్నతండ్రి మరణిస్తే, ఆయన మృతదేహాన్ని తరలించేందుకు కూడా డబ్బుల్లేని నిస్సహాయ స్థితిలో ఓ కుమారుడు తన బైక్‌పైనే శవాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో మహాప్రస్థానం వాహనం అందుబాటులో లేకపోవడం, ప్రైవేటు వాహనాలకు అడిగినంత ఇవ్వలేకపోవడంతో ఈ దయనీయ పరిస్థితి తలెత్తింది. ఈ ఘటన మంగళవారం బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో జరిగింది.

కర్లపాలెం మండలం చింతాయపాలెం గ్రామానికి చెందిన నక్కా నాగేసు (50) అనే వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలారు. కుటుంబసభ్యులు ఆయన్ను బైక్‌పై బాపట్లలోని ఏరియా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్లేందుకు మహాప్రస్థానం వాహనం కోసం చూడగా అది అందుబాటులో లేదు. దీంతో ప్రైవేటు ఆటోను సంప్రదించగా, వారు రూ. 2,000 డిమాండ్ చేశారు. అంత డబ్బు తమ దగ్గర లేకపోవడంతో, ఏం చేయాలో తెలియక నాగేసు కుమారుడు తన బంధువు సాయంతో తండ్రి శవాన్ని బైక్‌పై మధ్యలో కూర్చోబెట్టుకుని సుమారు 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామానికి తీసుకెళ్లాడు.

"ఆటోలో మృతదేహాన్ని తరలించడానికి రెండు వేల రూపాయలు అడిగారు. మా దగ్గర అంత డబ్బు లేదు. చేసేదేం లేక నేనూ, మా బాబాయి బైక్ మీదే మా నాన్న శవాన్ని ఇంటికి తీసుకువచ్చాం" అని మృతుడి కుమారుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

ఈ ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ బాపట్ల ఏరియా ఆసుపత్రిలో మహాప్రస్థానం వాహనం లేదని, దాని ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. ఘటనపై విచారణ జరిపిస్తామని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌వో) విజయ తెలిపారు. కాగా, తమ దృష్టికి తీసుకొస్తే సాయం చేసేవారమని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. కూలి పనులు చేసుకుని జీవించే యానాది సామాజిక వర్గానికి చెందిన నాగేసుకు భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.  
Go Back to Shorts
Nakka Nagesu
Bapatla district
karlapalem mandal
poverty
mortality
lack of ambulance
government hospital
private auto
Chintayapalem village
Andhra Pradesh

More Telugu News