హైదరాబాద్‌లో రూ.1,511 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

  • ఆక్ర‌మ‌ణ‌ల‌పై న‌గ‌రం న‌లువైపులా హైడ్రా చ‌ర్య‌లు
  • కొండాపూర్‌లో 4 ఎక‌రాల చెరువును కాపాడిన హైడ్రా
  • అల్వాల్ కొత్త చెరువు ఆక్ర‌మ‌ణ‌లు 8 ఎక‌రాల మేర‌ తొల‌గింపు
  • రాధాకృష్ణ న‌గ‌ర్‌లో 450 గ‌జాల పార్కును కాపాడిన హైడ్రా
  • జక్కిడి కాలనీలో 650 గ‌జాల పార్కుకు ఫెన్సింగ్
హైదరాబాద్‌లో నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో హైడ్రా రూ.1,511 కోట్ల విలువైన భూమిని రక్షించింది. ప్రభుత్వ భూములు, పార్క్ స్థలాలను ఆక్రమణల చెర నుంచి హైడ్రా విడిపించింది. ఆ భూముల చుట్టూ ఫెన్సింగ్ వేసి బోర్డులను ఏర్పాటు చేసింది. ఆక్రమణలను సీరియస్‌గా పరిగణిస్తున్న హైడ్రా... పార్కులు, చెరువులను ఆక్రమించిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. 

కొండాపూర్‌లో చెరువును కాపాడిన హైడ్రా

శేరిలింగంప‌ల్లి మున్సిప‌ల్ కార్యాల‌యం - మ‌దీనాగూడ రోడ్డు మార్గం కొండాపూర్‌లో రూ. 700 కోట్ల విలువైన భూమిని హైడ్రా కాపాడింది.  4 ఎక‌రాల జంగం కుంట‌ను పూడ్చేసి మ‌ట్టితో చ‌దును చేసి ప్లాట్లుగా విక్ర‌యించేందుకు సిద్ధ‌మైన క‌బ్జాదారుల ఆట క‌ట్టించింది. ఇటీవ‌ల మీడియాలో వ‌చ్చిన క‌థ‌నాల మేర‌కు రెవెన్యూ అధికారుల‌తో  హైడ్రా జాయింట్ ఇన్‌స్పెక్ష‌న్  చేసింది.  జంగం కుంట‌గా హైడ్రా నిర్ధారించుకుంది. క‌బ్జా చేసిన వారిపై రెవెన్యూ అధికారులు కేసులు కూడా పెట్టారు. హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ ఆదేశాల మేర‌కు ఫెన్సింగ్ వేసింది. 
 
అల్వాల్ కొత్త చెరువులో ఆక్ర‌మ‌ణ‌ల తొల‌గింపు

మేడ్చ‌ల్ - మ‌ల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండ‌లంలోని అల్వాల్ కొత్త చెరువు 8 ఎక‌రాల మేర ఆక్ర‌మ‌ణ‌ల‌ను హైడ్రా తొల‌గించింది. చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో ప్లాస్టిక్ కంప్రెసివ్ యూనిట్‌, ప్లాస్టిక్ వ్య‌ర్థాల సేక‌ర‌ణ కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తూ చెరువును క‌లుషితం చేస్తున్నార‌ని స్థానికులు హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. అలాగే అక్క‌డ ప‌ని వారికోసం తాత్కాలిక షెడ్డులు వేసి వ్య‌ర్థాల‌న్నీ చెరువులోకి వ‌దులుతున్నార‌ని పేర్కొన్నారు. చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధిలోని టెంటు సామ‌గ్రికి చెందిన 4 ష‌ట్ట‌ర్లు కూడా వేసిన‌ట్టు ఫిర్యాదు చేశారు. హైడ్రా అధికారులు క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించి చెరువు ఆక్ర‌మ‌ణ‌ల‌ను నిర్ధారించుకున్నారు. చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో ఎలాంటి క‌ట్ట‌డాలు, నిర్మాణాలు చేయ‌రాద‌నే నిబంధ‌న ప‌ట్ట‌కుండా ఏర్పాటు చేసిన షెడ్డుల‌ను హైడ్రా తొల‌గించింది.  

1100 గ‌జాల పార్కుల‌ను కాపాడిన హైడ్రా

వ‌న‌స్థ‌లిపురం సాహెబ్‌న‌గ‌ర్ క‌లాన్‌లోని జ‌క్కిడిన‌గ‌ర్ కాల‌నీలో 650 గ‌జాల పార్కు స్థ‌లాన్ని హైడ్రా కాపాడింది. స‌ర్వే నంబ‌రు 132, 133లో 1982లో 12 ఎక‌రాల మేర దాదాపు 161ప్లాట్ల‌తో జ‌క్కిడి కుటుంబ స‌భ్య‌లు లే ఔట్ వేశారు. ఇందులో 650 గజాల మేర పార్కుకోసం కేటాయించారు. 1985లోనే దీనిని ప్లాట్లుగా చేసి లే ఔట్ వేసిన వారే అమ్మేశార‌ని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈమేర‌కు ప్ర‌హ‌రీతో పాటు రెండు షెడ్డులు  నిర్మించారు. ప్ర‌జావాణిలో వ‌చ్చిన ఫిర్యాదు మేర‌కు క్షేత్ర‌స్థాయిలో హైడ్రా ప‌రిశీలించి పార్కు స్థ‌లంగా నిర్ధారించుకుంది. మంగ‌ళ‌వారం ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించి పార్కు చుట్టూ ఫెన్సింగ్ వేసింది. పార్కు స్థ‌లంగా పేర్కంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది.

మ‌ల్కాజిగిరి జోన్‌, మౌలాలి స‌ర్కిల్ ప‌రిధిలోని కాక‌తీయ న‌గ‌ర్‌లో రాధాకృష్ణ హౌసింగ్ కాల‌నీలో 450 గ‌జాల పార్కును హైడ్రా కాపాడింది. జీహెచ్ఎంసీకి గిఫ్ట్ డీడ్‌గా ఇచ్చిన ఈ పార్కు స్థలాన్ని ఆక్ర‌మించి నిర్మించిన ప్ర‌హ‌రీతో పాటు రేకుల షెడ్డును హైడ్రా తొల‌గించింది.


More Telugu News