క్షేత్రస్థాయిలో పర్యటించండి... విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు: సీఎం చంద్రబాబు

  • వేసవిలో నీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం
  • హాస్టల్ విద్యార్థుల ఆరోగ్యంపై కీలక వ్యాఖ్యలు... అధికారులదే బాధ్యత అని హెచ్చరిక
  • క్షేత్రస్థాయిలో పర్యటించి పాలన అమలును పరిశీలించాలని మంత్రులకు సూచన
  • గత ప్రభుత్వ అప్పుల వల్ల అధిక వడ్డీలు చెల్లిస్తున్నామని వెల్లడి
  • త్వరలో పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ తీసుకురానున్నట్లు ప్రకటన
వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఇప్పటి నుంచే పటిష్టమైన చర్యలు చేపట్టాలని, హాస్టళ్లలో విద్యార్థులు అనారోగ్యం పాలైతే సంబంధిత జిల్లా కలెక్టర్లు, మంత్రులనే బాధ్యుల్ని చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గట్టిగా హెచ్చరించారు. ప్రభుత్వ పాలసీలు క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నాయో తెలుసుకునేందుకు మంత్రులు, కార్యదర్శులు తప్పనిసరిగా క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పాలసీలు సమర్థవంతంగా అమలైతేనే ఆశించిన ఫలితాలు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

సోమవారం అమరావతి సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్ల రాష్ట్రం 14 శాతం అధిక వడ్డీతో అప్పులు చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ధిక క్రమశిక్షణను గాడిలో పెట్టి, రాష్ట్ర క్రెడిట్ రేటింగ్ పెంచడం ద్వారా వడ్డీ భారాన్ని తగ్గించుకునేందుకు రుణాలను రీషెడ్యూల్ చేస్తున్నామని వివరించారు. ప్రతి ఐదేళ్లకు జీఎస్‌డీపీ, తలసరి ఆదాయం రెట్టింపు కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

ఆరోగ్యం, విద్యపై ప్రత్యేక దృష్టి
ఆరోగ్య రంగంపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం సూచించారు. జూలై నాటికి 66 లక్షల హైరిస్క్ కేసులకు హెల్త్ స్క్రీనింగ్ పూర్తి చేయాలని, 5 లక్షల మంది హాస్టల్ విద్యార్థుల ఆరోగ్య పరీక్షలు చేపట్టాలని లక్ష్యంగా నిర్దేశించారు. గర్భిణుల్లో సిజేరియన్లు తగ్గించి, సాధారణ ప్రసవాలు పెరిగేలా అవగాహన కల్పించాలన్నారు. మాతాశిశు సంరక్షణ కోసం 'కేర్ అండ్ గ్రో' కార్యక్రమాన్ని, అంగన్‌వాడీలు, మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారం అందించాలని చెప్పారు. రాష్ట్ర జనాభా నిర్వహణ కోసం మార్చి నాటికి 'పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ' తీసుకురానున్నట్లు సీఎం వెల్లడించారు.

విద్యారంగంలో ఒత్తిడి లేని విద్యావిధానం అమలు చేయాలని, పదో తరగతి ఫలితాల్లో మెరుగుదలకు 100 రోజుల ప్రణాళికను పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. విద్యార్థుల ఆత్మహత్యలు జరగకూడదని, నూతన ఆవిష్కరణలకు స్వేచ్ఛాయుత వాతావరణం ఉండాలని అభిప్రాయపడ్డారు.

నీటి సంరక్షణ, అభివృద్ధిపై కీలక సూచనలు
రాష్ట్రంలోని 38 వేలకు పైగా ఉన్న చిన్న నీటిపారుదల చెరువులను పరిరక్షించాలని, భూగర్భ జలాలను 'నీటి బ్యాంకు' తరహాలో వాడాలని సూచించారు. పారిశ్రామిక కాలుష్యంతో జలాలు కలుషితం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అల్లూరి జిల్లా లంబసింగిలో కుంకుమ పువ్వు సాగు, ఏలూరు సమీపంలో కోకో సిటీ ఏర్పాటు వంటి వినూత్న ప్రాజెక్టులకు అవకాశాలున్నాయని, వీటిని ప్రోత్సహించాలని సీఎం సూచించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఇతర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


More Telugu News