ఎస్‌బీఐ యోనో యూజర్లకు అలర్ట్!

  • తన ఖాతాదారులకు హెచ్చరిక జారీ చేసిన ఎస్‌బీఐ
  • కస్టమర్లకు ఆధార్ అప్‌డేట్ చేయకపోతే మీ ఎస్‌బీఐ యోనో ఖాతా బ్లాక్ అవుతుంది అంటూ నకిలీ మెసేజ్‌లు వస్తున్నట్లు వెల్లడి
  • ఈ తరహా సందేశాలు పూర్తిగా నకిలీవన్న ఎస్‌బీఐ
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన ఖాతాదారులకు కీలక హెచ్చరిక జారీ చేసింది. కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగిస్తున్న ఎస్‌బీఐ యోనో యాప్‌ను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని బ్యాంక్ తెలిపింది. వాట్సాప్ ద్వారా నకిలీ సందేశాలు పంపిస్తూ ఖాతాదారుల వివరాలు దొంగిలించి అకౌంట్లు ఖాళీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎస్‌బీఐ అప్రమత్తం చేసింది. 

ఇటీవల ఎస్‌బీఐ కస్టమర్లకు ఆధార్ అప్‌డేట్ చేయకపోతే మీ ఎస్‌బీఐ యోనో ఖాతా బ్లాక్ అవుతుంది అంటూ నకిలీ మెసేజ్‌లు వస్తున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. ఈ సందేశాల్లో ఎస్‌బీఐ లోగోతో పాటు Official Aadhaar Update APKని డౌన్‌లోడ్ చేసుకుని KYC పూర్తి చేయాలని సూచిస్తూ SBI KYC AADHAAR UPDATE.apk అనే ఫైల్‌ను పంపిస్తున్నారు. 

ఈ తరహా సందేశాలు పూర్తిగా నకిలీవని ఎస్‌బీఐ స్పష్టం చేసింది. తమ బ్యాంక్ ఎప్పుడూ APK ఫైళ్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని కస్టమర్లను కోరదని తెలిపింది. వినియోగదారులు ఆ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేస్తే మొబైల్‌లో మాల్వేర్ ఇన్‌స్టాల్ అయ్యి బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బు మాయం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

అందువల్ల ఇలాంటి సందేశాలు వచ్చిన వెంటనే వాటిని పట్టించుకోకుండా డిలీట్ చేయాలని, సంబంధిత నంబర్‌ను బ్లాక్ చేయాలని ఎస్‌బీఐ సూచించింది. అలాగే ఘటనను వెంటనే బ్యాంక్ అధికారులకు తెలియజేయాలని తెలిపింది. 

ఇక ఎవరికైనా అనుకోకుండా ఆ ఫైల్ డౌన్‌లోడ్ చేసి డబ్బు నష్టం జరిగితే, వెంటనే సైబర్ మోసం హెల్ప్‌ లైన్ నంబర్ 1930కు ఫిర్యాదు చేయాలని ఎస్‌బీఐ సూచించింది. అలాగే cybercrime.gov.inలోని నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో కూడా ఫిర్యాదు నమోదు చేయవచ్చని తెలిపింది.


More Telugu News