Indian Students Russia: రష్యా యూనివర్సిటీలో కలకలం.. భారత విద్యార్థులపై కత్తితో దాడి

4 Indian Students Injured After Knife Attack In Russian College
  • రష్యాలోని ఉఫా నగరంలో భారత విద్యార్థులపై దాడి
  • కత్తిపోట్లలో నలుగురు భారత విద్యార్థులకు గాయాలు
  • నిందితుడిని అడ్డుకోగా ఇద్దరు పోలీసులకూ గాయాలైన వైనం
  • గాయపడిన విద్యార్థులకు సాయం అందిస్తున్న భారత ఎంబ‌సీ
  • నిందితుడు కూడా తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స
రష్యాలో చదువుకుంటున్న భారత విద్యార్థులు దాడికి గురయ్యారు. ఉఫా నగరంలోని ఓ యూనివర్సిటీలో జరిగిన కత్తిదాడిలో నలుగురు భారతీయ విద్యార్థులతో సహా పలువురు గాయపడ్డారు. ఈ విషయాన్ని మాస్కోలోని భారత రాయబార కార్యాలయం అధికారికంగా ధ్రువీకరించింది.

స్థానిక మీడియా కథనాల ప్రకారం బాష్కోర్టోస్తాన్ రిపబ్లిక్‌లోని ఉఫా నగరంలో ఉన్న స్టేట్ మెడికల్ యూనివర్సిటీ హాస్టల్‌లోకి ఓ టీనేజర్ కత్తితో ప్రవేశించాడు. అక్కడున్న విద్యార్థులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో నలుగురు భారత విద్యార్థులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా, అతను వారిపై కూడా దాడి చేశాడు. ఈ క్రమంలో ఇద్దరు పోలీసు అధికారులు కూడా గాయపడ్డారు. ఆ తర్వాత నిందితుడు తనకు తాను హాని చేసుకున్నాడని రష్యా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం నిందితుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఈ ఘటనపై భారత రాయబార కార్యాలయం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించింది. "ఉఫాలో ఒక దురదృష్టకర సంఘటన జరిగింది. నలుగురు భారత విద్యార్థులతో సహా పలువురు గాయపడ్డారు. మేము స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాము. గాయపడిన విద్యార్థులకు సహాయం అందించేందుకు కజాన్‌లోని కాన్సులేట్ అధికారులు ఉఫాకు బయలుదేరారు" అని పోస్ట్‌లో పేర్కొంది. కాగా, వైద్య విద్య కోసం ప్రతి ఏటా భారత్ నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు రష్యాకు వెళ్తుంటారనే విష‌యం తెలిసిందే.
Indian Students Russia
Russia Indian Students Attack
Ufa Russia
Bashkortostan Republic
State Medical University Ufa
Indian Embassy Moscow
Indian Students Medical Education Russia

More Telugu News