Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా గడువు.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన

Zelensky announces US deadline for Russia Ukraine war resolution
  • గడువులోగా లక్ష్యం నెరవేరకపోతే ట్రంప్ యంత్రాంగం ఇరుపక్షాలపై ఒత్తిడి తీసుకువస్తుందని వెల్లడి
  • యుద్ధానికి తెరదించేందుకు అన్ని విధాలా సహకరిస్తామని అమెరికా హామీ ఇచ్చిందని వెల్లడి
  • యుద్ధం ముగింపునకు కచ్చితమైన షెడ్యూల్ కావాలని అమెరికా అడిగిందన్న జెలెన్‌స్కీ
దాదాపు నాలుగు సంవత్సరాలుగా జరుగుతోన్న యుద్ధం ముగింపునకు ఒప్పందం కుదుర్చుకోవడానికి ఉక్రెయిన్, రష్యా దేశాలకు జూన్ నెలాఖరు వరకు అమెరికా గడువు ఇచ్చిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. అమెరికా విధించిన గడువులోగా లక్ష్యం నెరవేరకపోతే దానిని సాధించేందుకు ట్రంప్ యంత్రాంగం ఇరుపక్షాలపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉందని వెల్లడించారు.

"ఈ వేసవి ప్రారంభం నాటికి యుద్ధాన్ని ముగించాలని అమెరికన్లు సూచించారు. జూన్ నాటికి అన్ని వ్యవహారాలను కొలిక్కి తీసుకురావాలని చెప్పారు. యుద్ధానికి తెరదించేందుకు అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు కచ్చితమైన షెడ్యూల్ కావాలని అమెరికన్లు అడిగారు. దీని ప్రకారం వారు ఇరు దేశాలపై ఒత్తిడి తీసుకు వచ్చే అవకాశం ఉంది" అని జెలెన్‌స్కీ కీలక ప్రకటన చేశారు.

రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య దాదాపు నాలుగేళ్లుగా యుద్ధం జరుగుతోంది. యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తోంది. రష్యా, ఉక్రెయిన్ దేశాల ప్రతినిధులు ఇప్పటికే రెండుసార్లు చర్చలు జరిపారు. అబుదాబీ వేదికగా జరిగిన రెండో విడత చర్చల్లో అమెరికా ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. మూడో విడత చర్చలు అమెరికాలో నిర్వహించేందుకు ట్రంప్ ప్రభుత్వం ముందుకు వచ్చింది.
Zelensky
Ukraine Russia war
Russia Ukraine conflict
US deadline
peace talks
war negotiations

More Telugu News