India-US Relations: పాక్‌కు గట్టి షాక్.. పీఓకే సహా కశ్మీర్ భారత్‌దేనంటూ అమెరికా మ్యాప్

Washingtons Message To Pakistan With A Kashmir Map
షార్ట్స్‌లో చూడండి
జమ్మూకశ్మీర్ విషయంలో పాకిస్థాన్‌కు అమెరికా గట్టి దౌత్యపరమైన షాక్ ఇచ్చింది. జమ్మూకశ్మీర్ భారత్‌లో అంతర్భాగమన్న వాదనకు పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతూ కీలక చర్య తీసుకుంది. అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ కార్యాలయం (USTR) విడుదల చేసిన భారత మ్యాప్‌లో పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) సహా మొత్తం జమ్మూకశ్మీర్‌ను భారత్ భూభాగంగా స్పష్టంగా చూపించింది. ఈ చర్య ద్వారా భారత్ రాజకీయ పటాన్ని అమెరికా నాయకత్వం అంగీకరిస్తున్నట్లు, నిరాధారమైన ప్రాదేశిక వాదనలకు మద్దతు ఇవ్వబోమని పరోక్షంగా స్ప‌ష్టం చేసింది.

భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పంద ఫ్రేమ్‌వర్క్‌కు సంబంధించిన ఒక గ్రాఫిక్‌లో భాగంగా ఈ మ్యాప్‌ను విడుదల చేశారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ వంటి వారు వాషింగ్టన్‌లో తమకు అనుకూలంగా లాబీయింగ్ చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ఇస్లామాబాద్‌కు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. దశాబ్దాలుగా పాకిస్థాన్ ప్రచారం చేస్తున్న అబద్ధాలను అమెరికా విశ్వసించడం లేదని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.

పాకిస్థాన్‌తో అమెరికాకు సైనిక పరికరాల అమ్మకం, ఖనిజాల వెలికితీత వంటి అంశాల్లో ప్రయోజనాలు ఉన్నప్పటికీ, భారత్‌తో ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈ చర్య ద్వారా స్పష్టమైన సంకేతాలు పంపింది. ప్రపంచ రాజకీయాల్లో కీలకమైన గ్లోబల్ పార్ట్‌నర్‌గా ఉన్న భారత్‌కు ప్రత్యామ్నాయం లేదని అమెరికా చెప్పకనే చెప్పినట్లయింది. ఇది ఇస్లామాబాద్‌లోని అధికార వర్గాలకు మింగుడుపడని దౌత్యపరమైన దెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు.

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంలో భాగంగా అమెరికా నుంచి దిగుమతి అయ్యే పలు ఉత్పత్తులపై భారత్ సుంకాలను తగ్గించనుంది. అదే సమయంలో భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాలను 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడానికి, అదనపు 25 శాతం సుంకాన్ని ఉపసంహరించుకోవడానికి వాషింగ్టన్ అంగీకరించింది. ఈ వాణిజ్య ఒప్పంద ప్రకటనలో భాగంగా విడుదల చేసిన మ్యాప్, రెండు దేశాల మధ్య పెరుగుతున్న విశ్వాసానికి, బలపడుతున్న సంబంధాలకు నిదర్శనంగా నిలుస్తోంది.
Go Back to Shorts
India-US Relations
Pakistan
Jammu and Kashmir
PoK
India
America
US Trade Representative
Shehbaz Sharif
Asim Munir
Trade Agreement

More Telugu News