Navjot Kaur: ‘పప్పు’ అని ఊరికే అనలేదు.. రాహుల్ గాంధీపై నవజ్యోత్ కౌర్ నిప్పులు

Navjot Kaur Slams Rahul Gandhi for Congress Party Decline
షార్ట్స్‌లో చూడండి
పంజాబ్ మాజీ ఎమ్మెల్యే నవజ్యోత్ కౌర్ సిద్ధూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై సంచలన విమర్శలు చేశారు. రాహుల్‌కు క్షేత్రస్థాయి రాజకీయాలపై కనీస అవగాహన లేదని, పార్టీ కార్యకర్తల గోడు వినే తీరిక ఆయనకు లేదని మండిపడ్డారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను పట్టించుకోకపోవడం వల్లే ఆయనకు ‘పప్పు’ అనే పేరు వచ్చిందని ఎద్దేవా చేశారు. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత ఆమె మొదటిసారి సోషల్ మీడియా వేదికగా అధిష్ఠానంపై తన అసహనాన్ని వెళ్లగక్కారు.

"రాహుల్ గాంధీకి కార్యకర్తల కోసం సమయం లేనప్పుడు, వారికి కూడా ఆయనతో పనేముంది?" అని కౌర్ ప్రశ్నించారు. అత్యవసర విషయాలపై పిలిచినా నెలల తరబడి స్పందించని నాయకత్వం వల్ల పార్టీ నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పంజాబ్ ముఖ్యమంత్రి పదవి కోసం రూ. 500 కోట్ల సూట్‌కేస్ సిద్ధం చేసుకున్న వారికే ప్రాధాన్యం ఇస్తున్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో చిచ్చు రేపాయి. తన ప్రతిభను గుర్తించి 2012లో టికెట్ ఇచ్చి గౌరవించింది బీజేపీయేనని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజా వారింగ్‌ను కౌర్ అసమర్థుడిగా అభివర్ణించారు. కాగా, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ పోరాడుతున్నారని, ఇలాంటి వ్యక్తిగత విమర్శలు తగవని పంజాబ్ కాంగ్రెస్ నేతలు ఆమెకు కౌంటర్ ఇస్తున్నారు. కాంగ్రెస్‌ను వీడిన తర్వాత ఆమె తిరిగి పాత గూడు బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ, ప్రస్తుతం ఎవరితోనూ సంప్రదింపుల్లో లేనని ఆమె స్పష్టం చేశారు.
Go Back to Shorts
Navjot Kaur
Rahul Gandhi
Congress party
Punjab politics
Indian National Congress
Raja Warring
BJP
Navjot Kaur Sidhu
Indian politics

More Telugu News