Kondamangale Panduranga: పదవి కోసం కన్నకూతురినే కాల్వలోకి తోసేసిన తండ్రి!

Maharashtra Father Kills Daughter Over Sarpanch Election Rules
షార్ట్స్‌లో చూడండి
రాజకీయం మనుషుల్లోని మమకారాన్ని ఎంతలా చంపేస్తుందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. సర్పంచ్‌గా పోటీ చేసేందుకు 'ముగ్గురు పిల్లల నిబంధన' అడ్డుగా ఉందని భావించిన ఓ తండ్రి, పదవి కోసం కన్నకూతురినే బలి తీసుకున్నాడు. మహారాష్ట్రలో జరిగిన ఈ దారుణ ఉదంతం నిజామాబాద్ జిల్లా పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది.

మహారాష్ట్రలోని కేరూర్ గ్రామానికి చెందిన కొండమంగలే పాండురంగ అనే వ్యక్తి సెలూన్ నడుపుతుంటాడు. అతడికి ఇద్దరు కవల ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. ఎలాగైనా తన ఊరికి సర్పంచ్ కావాలని ఆశపడ్డాడు. అయితే, ముగ్గురు సంతానం ఉంటే ఎన్నికల్లో పోటీకి అర్హత ఉండదని తెలుసుకున్న పాండురంగ, తన మూడో బిడ్డ బర్త్ సర్టిఫికేట్ మార్చడానికి పుణెలో ప్రయత్నించి విఫలమయ్యాడు.

తన దారికి అడ్డుగా ఉన్న పిల్లల్లో ఒకరిని అడ్డుతొలగించుకోవాలని పాండురంగ నిర్ణయించుకున్నాడు. దీనికి ప్రస్తుత సర్పంచ్ షిండే గణేశ్‌తో కలిసి పన్నాగం పన్నాడు. గత నెల 29న తన ఆరేళ్ల కుమార్తె ప్రాచీని మాయమాటలు చెప్పి బైక్‌పై నిజామాబాద్ జిల్లా ఎడపల్లికి తీసుకొచ్చాడు. ఏమాత్రం కనికరం లేకుండా చిన్నారిని నిజాంసాగర్ కెనాల్‌లోకి తోసేసి నిందితులిద్దరూ పరారయ్యారు.

కాలువలో చిన్నారి మృతదేహాన్ని గుర్తించిన బోధన్ పోలీసులు తొలుత గుర్తుతెలియని శవంగా కేసు నమోదు చేశారు. ఏసీపీ శ్రీనివాస్ నేతృత్వంలో దర్యాప్తు ప్రారంభించి, పాప ఫోటోను సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చేశారు. సుధీర్ అనే కానిస్టేబుల్ తన వాట్సాప్ స్టేటస్‌లో పెట్టిన ఫోటోను చూసిన మహారాష్ట్రలోని కేరూర్ గ్రామస్థులు.. అది పాండురంగ కూతురని గుర్తించి సమాచారం అందించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం నిందితులిద్దరూ జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. 
Go Back to Shorts
Kondamangale Panduranga
Maharashtra
Nizamabad
Sarpanch Election
Infanticide
Political Crime
Shinde Ganesh
Nizam Sagar Canal
Edapalli

More Telugu News