ప్రభుత్వ జీతం నాకు వద్దు.. ఒక్క రూపాయి కూడా తీసుకోను: మంతెన సంచలన నిర్ణయం

  • ఏపీ ప్రభుత్వ యోగా, నేచురోపతి సలహాదారుగా నియమితులైన మంతెన
  • క్యాబినెట్ హోదా ఉన్నా జీతం, సౌకర్యాలు తీసుకోబోనని ప్రకటన
  • సీఎం చంద్రబాబు ముందు కఠిన నిబంధనలు పెట్టిన మంతెన సత్యనారాయణ రాజు
  • ప్రభుత్వ ధనం ప్రజలదని, దాన్ని స్వీకరించనని స్పష్టీకరణ
  • నిస్వార్థ సేవ చేయాలన్న మంతెన నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు
ప్రముఖ యోగా, ప్రకృతి వైద్య నిపుణుడు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు తన ప్రభుత్వ పదవికి సంబంధించి ఒక ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యోగా, నేచురోపతి విభాగం సలహాదారుగా నియమితులైన ఆయన, క్యాబినెట్ హోదా ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి జీతభత్యాలు గానీ, ఇతర సౌకర్యాలు గానీ స్వీకరించబోనని స్పష్టం చేశారు. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

గతేడాది డిసెంబర్‌లో సీఎం చంద్రబాబు.. మంతెన సత్యనారాయణ రాజును రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించిన విషయం తెలిసిందే. బిల్ గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి ప్రభుత్వం చేపడుతున్న 'సంజీవని' వంటి ఆరోగ్య కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లేందుకు ఆయన సలహాలు తీసుకోవాలని సీఎం భావించారు. ఈ నేపథ్యంలో మంతెనతో సీఎం చంద్రబాబు దాదాపు 20 నిమిషాల పాటు చర్చించి, పదవిని చేపట్టాలని కోరారు.

అయితే, ఈ పదవిని స్వీకరించడానికి తాను మొదట విముఖత చూపినట్లు మంతెన తెలిపారు. కేవలం తెరవెనుక ఉండి సలహాలు ఇస్తానని చెప్పగా, అధికారిక హోదా ఉంటేనే సూచనలకు విలువ ఉంటుందని, పనులు వేగంగా జరుగుతాయని సీఎం చంద్రబాబు నచ్చజెప్పినట్లు వివరించారు. ముఖ్యమంత్రి కోరికను కాదనలేక పదవిని స్వీకరించడానికి అంగీకరించినప్పటికీ, తాను కొన్ని కఠినమైన షరతులు విధించినట్లు మంతెన పేర్కొన్నారు.

"నేను ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా జీతంగా తీసుకోను. ప్రభుత్వ వాహనం సహా ఎలాంటి సౌకర్యాలు వినియోగించుకోను. ఈ నిబంధనలకు అంగీకరిస్తేనే బాధ్యతలు చేపడతాను" అని సీఎంకు తేల్చిచెప్పగా, ఆయన అందుకు సమ్మతించారని మంతెన వెల్లడించారు. గత 35 ఏళ్లుగా తన పుస్తకాలపై వచ్చే ఆదాయంతోనే జీవిస్తున్నానని, తాను నిర్వహిస్తున్న ఆశ్రమం నుంచి కూడా జీతం తీసుకోలేదని ఆయన తెలిపారు. ప్రభుత్వ ధనం ప్రజలదేనని, దానిని స్వీకరించకూడదనేది తన జీవిత నియమమని ఆయన అన్నారు.


More Telugu News