Japan: ఇరాన్, అమెరికా యుద్ధం.. చమురు నిల్వలు విడుదల చేయాలని జపాన్ కీలక నిర్ణయం

Japan to Release Oil Reserves Amid Iran Israel War
  • తమ వద్ద ఉన్న నిల్వల్లో కొంత భాగం విడుదల చేస్తామన్న జపాన్
  • మార్చి 16వ తేదీ నాటికి మార్కెట్లోకి తీసువస్తామని ప్రకటన
  • ఇంధన మార్కెట్ స్థిరీకరణకు ఉపయోగపడుతుందన్న జపాన్ ప్రధాని
ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం ఎదుర్కొంటుంది. దీనితో ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జపాన్ కీలక నిర్ణయం తీసుకున్నది. తమ వద్ద ఉన్న చమురు నిల్వల్లో కొంత భాగాన్ని విడుదల చేస్తామని తెలిపింది. మార్చి 16వ తేదీ నాటికి మార్కెట్లోకి తీసుకువస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ ప్రధాని సనయే తకయిచి వెల్లడించారు.

మార్చి 16 నుంచి చమురు నిల్వల్లో కొంత భాగాన్ని విడుదల చేయడం ప్రారంభిస్తామని తెలిపారు. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ అనిశ్చితుల వేళ ఇంధన మార్కెట్‌ను స్థిరీకరించేందుకు తమ వద్ద ఉన్న చమురు నిల్వలను విడుదల చేస్తామని అన్నారు. ప్రైవేటు రంగ సంస్థల చమురు నిల్వలను, ప్రభుత్వరంగ చమురు నిల్వలను విడుదల చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. అప్పుడు చమురు లభ్యత పెరిగి ధరల స్థిరీకరణకు దోహదపడుతుందని అన్నారు.

పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో జీ7 దేశాల ఆర్థిక మంత్రులు ఆన్‌లైన్ ద్వారా సమావేశమై, ఇంధన సరఫరాల్లోని అంతరాయంపై చర్చించారు. ప్రస్తుత పరిస్థితుల్లో చమురు నిల్వలను విడుదల చేసి మద్దతుగా నిలువాలని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ జీ7 దేశాలను కోరింది. కాగా, తమ వద్ద ఉన్న చమురు నిల్వలను విడుదల చేయాలని నిర్ణయించిన తొలి జీ7 దేశం జపాన్ కావడం గమనార్హం.
Japan
Iran Israel war
oil reserves
crude oil
energy crisis
G7 nations
International Energy Agency

More Telugu News