Bhanu Prakash Reddy: తిరుమలపైకి జగన్ అనకొండలను పంపిస్తున్నారు: భానుప్రకాష్ రెడ్డి

Bhanu Prakash Reddy Criticizes YCP Leaders on Tirumala Allegations
  • వైసీపీ నేతలు తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నారన్న భానుప్రకాష్ రెడ్డి
  • అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని మండిపాటు
  • రవికుమార్ దొరికినప్పుడు మీరేం చేశారని ప్రశ్న

తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వైసీపీ నేతలు అసత్య ప్రచారాలకు ఒడిగడుతున్నారని టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతి ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే ఇప్పుడు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు.


తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చున్న జగన్ ఏడుకొండలపైకి అనకొండలను పంపిస్తున్నారని ఆయన విమర్శించారు. "ఎన్ని అనకొండలు వచ్చినా ఆ ఆదిశేషుడి ముందు తోక ఆడించలేవు" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దాదాపు 11 నెలల క్రితం జరిగిన ఒక పాత ఘటనను నిన్ననే జరిగినట్లుగా చిత్రీకరిస్తూ టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.


పరకామణిలో చోరీకి ప్రయత్నించిన పెంచలయ్య అనే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిని తాము పట్టుకుని జైలుకు పంపించామని భానుప్రకాష్ రెడ్డి గుర్తుచేశారు. ఈ సందర్భంగా గత వైసీపీ పాలనలో జరిగిన రవికుమార్ దొంగతనం ఉదంతాన్ని ఆయన ప్రస్తావించారు. "అప్పట్లో రవికుమార్ దొరికినప్పుడు మీరేం చేశారు? విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్‌ శివశంకర్ ద్వారా ఆధారాలను, విజువల్స్‌ను మాయం చేసింది వాస్తవం కాదా? ఆ దొంగతనంలో వాటాలు పంచుకుంది మీరు కాదా?" అని సూటిగా ప్రశ్నించారు. శ్రీవారి హుండీలో కానుకలు పడకుండా చేసి, తిరుమల ప్రతిష్టను దెబ్బతీయడమే వైసీపీ అసలు లక్ష్యమని ఆయన ఆరోపించారు.

Bhanu Prakash Reddy
TTD
Tirumala
Jagan
YCP
Andhra Pradesh Politics
Corruption Allegations
Karunakar Reddy
Ravi Kumar Theft
Tirupati

More Telugu News