గంభీర్‌కు వ్యతిరేకంగా అభిమానుల నినాదాలు.. కోహ్లీ షాక్.. ఇదిగో వీడియో!

  • కివీస్‌తో వన్డే సిరీస్ ఓటమి తర్వాత కోచ్ గంభీర్‌పై ఫ్యాన్స్ ఆగ్రహం
  • ఇండోర్ స్టేడియంలో "గంభీర్ హే హే" అంటూ భారీగా నినాదాలు
  • భారత గడ్డపై న్యూజిలాండ్‌కు ఇదే తొలి వన్డే సిరీస్ విజయం
  • విమర్శలు వస్తున్నా గంభీర్ పదవికి ఢోకా లేదన్న బీసీసీఐ వర్గాలు
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై భారత క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను భారత్ కోల్పోయిన తర్వాత ఇండోర్ స్టేడియంలో గంభీర్‌కు వ్యతిరేకంగా ఫ్యాన్స్ నినాదాలు చేశారు. "గౌతమ్ గంభీర్ హే హే" అంటూ వారు హోరెత్తించడం అక్కడున్న ఆటగాళ్లను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా అభిమానుల నినాదాల‌తో విరాట్ కోహ్లీ షాక్ అయ్యి, వారిని వారించే ప్ర‌య‌త్నం చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట‌ వైరల్ అవుతోంది.

ఆదివారం జరిగిన మూడో వన్డేలో ఓటమితో, భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-2 తేడాతో న్యూజిలాండ్‌కు అప్పగించింది. భారత గడ్డపై కివీస్‌కు ఇదే మొట్టమొదటి వన్డే సిరీస్ విజయం కావడం గమనార్హం. ఈ ఓటమి తర్వాత ఆన్‌లైన్‌లో కూడా గంభీర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. అతడిని కోచ్ పదవి నుంచి తొలగించాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు.

గంభీర్ కోచింగ్‌లో భారత్ టీ20 ఫార్మాట్‌లో 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ వంటి విజయాలు సాధించినా.. టెస్టులు, వన్డేల్లో మాత్రం ఆశించిన ఫలితాలు రావడం లేదు. 2024లో స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్ అవ్వడం కూడా అభిమానుల ఆగ్రహానికి ఒక కారణం.

అయితే, ఈ విమర్శల నేపథ్యంలో గంభీర్ పదవికి వచ్చిన ముప్పేమీ లేదని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 2027 వరకు ఉన్న తన కాంట్రాక్టును గంభీర్ పూర్తిచేసుకుంటారని తెలుస్తోంది. 2024 జులై నుంచి గంభీర్ కోచింగ్‌లో భారత్ ఆడిన 20 వన్డేల్లో 12 గెలిచింది. కానీ శ్రీలంక, ఆస్ట్రేలియా, తాజాగా న్యూజిలాండ్ చేతిలో సిరీస్ ఓటములు ఎదుర్కొంది.


More Telugu News