నిర్మల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం .. నలుగురు మృతి

  • బైంసా పట్టణంలోని సత్‌‌పూర్‌ బ్రిడ్జి వద్ద కంటైనర్, కారు ఢీకొనడంతో ప్రమాదం
  • కారులో ఉన్న కబీరు మండలం కుప్టీ గ్రామానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి చెందిన వైనం
  • తీవ్రంగా గాయపడిన నూతన సర్పంచ్ గంగాధర్ ను నిజామాబాద్‌లోని ఆసుపత్రికి తరలింపు
  • ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
నిర్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బైంసా పట్టణంలోని సత్‌పూల్ బ్రిడ్జి వద్ద ఎదురెదురుగా వస్తున్న కంటైనర్, కారు ఢీకొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమ బంధువులను పరామర్శించేందుకు కారులో హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో కబీరు మండలం కుప్టీ గ్రామానికి చెందిన బోజరాం పటేల్ (42), రాజన్న (60), బాబన్న (70), కారు డ్రైవర్ వికాస్ (35) మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో ఇటీవలే సర్పంచ్‌గా ఎన్నికైన గంగాధర్ కూడా ఉన్నారు. ఆయనకు తలకు తీవ్ర గాయాలు కావడంతో నిజామాబాద్‌లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బైంసా ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


More Telugu News