రోహిత్ శర్మ కెప్టెన్సీ కోల్పోవడం వెనుక అగార్కర్, గంభీర్‌ల పాత్ర: మాజీ క్రికెటర్

  • రోహిత్ శర్మ తొలగింపు నిర్ణయం వెనుక అగార్కర్, గంభీర్ ఉన్నారని ఆరోపణ
  • రోహిత్ శర్మను అవమానించినట్లే అవుతుందన్న మనోజ్ తివారి
  • రోహిత్ శర్మ ఆటపై ఎందుకు సందేహాలు ఉన్నాయో అర్థం కావడం లేదని వ్యాఖ్య
భారత క్రికెట్ దిగ్గజం రోహిత్ శర్మ, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో జాతీయ జట్టును విజయపథంలో నడిపించినప్పటికీ, ఊహించని విధంగా వన్డే కెప్టెన్సీని కోల్పోవడం తెలిసిందే. రోహిత్ శర్మను తప్పించి శుభ్‌మన్ గిల్‌కు బాధ్యతలు అప్పగించారు. రోహిత్ శర్మ కెప్టెన్సీ కోల్పోవడం వెనుక బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ల పాత్ర ఉందని మాజీ క్రికెటర్ మనోజ్ తివారి ఆరోపించాడు.

అగార్కర్ సంచలన నిర్ణయాలు తీసుకోవడానికి సంకోచించడని, అయితే కెప్టెన్సీ తొలగింపు నిర్ణయం వెనుక మరొకరి పాత్ర కూడా ఉండవచ్చని మనోజ్ తివారీ అన్నాడు. అగార్కర్ ఒక్కడే ఇంతటి సాహసం చేయలేడని స్పష్టం చేశాడు. కోచ్ సూచనల ప్రకారమే చీఫ్ సెలక్టర్‌గా అగార్కర్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడని అభిప్రాయపడ్డాడు. ఈ నిర్ణయానికి మాత్రం అగార్కర్, గంభీర్ ఇద్దరూ బాధ్యులేనని పేర్కొన్నాడు.

టీ20 ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలను రోహిత్ శర్మ కెప్టెన్సీలోనే సాధించామని, అలాంటి క్రీడాకారుడి స్థానంలో మరొక వ్యక్తిని నియమించడం సరికాదని వ్యాఖ్యానించాడు. రోహిత్ శర్మను ఇది అవమానించినట్లేనని అన్నాడు. రోహిత్ శర్మ వన్డే ప్రపంచ కప్ 2027 ఆడటంపై వారికి సందేహాలు ఎందుకు ఉన్నాయో తనకు అర్థం కావడం లేదని అన్నాడు.

అతడి సామర్థ్యాన్ని అవమానించడం పొరపాటు అవుతుందని అన్నాడు. వన్డే ఫార్మాట్‌లలో మూడు డబుల్ సెంచరీలు సాధించిన విషయాన్ని మరిచిపోకూడదని తెలిపాడు. ప్రస్తుత భారత తుది జట్టు ఎంపికలో లోపాలు ఉన్నాయని అన్నాడు. తనకు వన్డే మ్యాచ్‌లపై ఆసక్తి పోయిందని వ్యాఖ్యానించాడు.


More Telugu News