పహల్గామ్ ఉగ్రదాడి.. ఆ కెమెరాల వివరాల కోసం చైనా సాయం కోరనున్న ఎన్ఐఏ

Pahalgam Terror Attack NIA Seeks China Help on GoPro Camera Details
  • దాడి సమయంలో గో ప్రో కెమెరాలను ఉపయోగించిన ఉగ్రవాదులు
  • కెమెరాలను స్వాధీనం చేసుకున్న ఎన్ఐఏ అధికారులు
  • గో ప్రో కెమెరాల వివరాల కోసం చైనా సాయం కోరనున్న ఎన్ఐఏ
జమ్ము కశ్మీర్‌లోని పహల్గామ్‌లో గత సంవత్సరం జరిగిన ఉగ్రదాడికి సంబంధించిన గో ప్రో హీరో 12 మోడల్ బ్లాక్ కెమెరాలను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) స్వాధీనం చేసుకుంది. ఈ దాడికి సంబంధించి ఉగ్రవాదుల కదలికల అంశాలకు ఈ కెమెరాలు కీలకమైనవిగా భావిస్తున్నారు. ఈ క్రమంలో పహల్గామ్‌కు సంబంధించి తాజాగా కీలక విషయం వెలుగులోకి వచ్చింది.

పహల్గామ్ ఉగ్రదాడి సమయంలో ఉగ్రవాదులు గో ప్రో కెమెరాలను ఉపయోగించినట్లు గుర్తించింది. వీటి కొనుగోలుదారుల వివరాలను తెలుసుకోవడానికి చైనా సాయం కోరేందుకు ఎన్ఐఏ సిద్ధమైంది. ఇందుకోసం జమ్ముకశ్మీర్‌లోని ప్రత్యేక న్యాయస్థానం నుంచి దర్యాప్తు సంస్థకు అనుమతులు లభించాయి.

ఘటనా స్థలంలో గో ప్రో కెమెరాలను స్వాధీనం చేసుకున్న ఎన్ఐఏ, వీటి ఆధారంగా దాడికి ముందు ఉగ్రవాదుల కదలికలు, ప్రణాళికల గురించి తెలుసుకోవడానికి దర్యాప్తులో ఇవి కీలకంగా మారనున్నట్లు అధికారులు భావిస్తున్నారు.

గత ఏడాది ఏప్రిల్‌లో పహల్గామ్ ఉగ్రదాడి జరిగింది. ఈ దాడికి ఏడాది ముందు చైనాకు చెందిన ఏఈ గ్రూప్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వద్ద ఈ గో ప్రో కెమెరాలు ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. 2024 జనవరి 30న చైనాలోని డోంగ్వాన్‌లో ఇవి యాక్టివేట్ అయినట్లు తెలిపారు.

ఈ క్రమంలో గో ప్రో కెమెరా తయారీదారు గో ప్రో బీవీకి నోటీసులు జారీ చేసినట్లు ఎన్ఐఏ వెల్లడించింది. అయితే వీటి లావాదేవీలకు సంబంధించి ఎలాంటి రికార్డులు లేవని తయారీదారులు సమాచారం ఇచ్చినట్లు ఎన్ఐఏ తెలిపింది. ఈ క్రమంలో వీటిని ఎవరు కొనుగోలు చేశారు, చివరిసారి ఎవరు వినియోగించారనే వివరాలు తెలుసుకోవడానికి ఎన్ఐఏ చైనా సాయం కోరనుంది. చైనా న్యాయశాఖకు లేఖ రాయడానికి ఎన్ఐఏకు హోంమంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు వచ్చాయి.
Go Back to Shorts
Pahalgam Terror Attack
NIA
GoPro Camera
China
Jammu Kashmir
Terrorists
AE Group International Limited

More Telugu News