నియంత పాలనకు ఇంతకుమించి నిదర్శనం ఉంటుందా?: సజ్జల

  • ఏపీలో రాజకీయ వేధింపులు హద్దులు దాటాయన్న సజ్జల
  • పార్టీ లీగల్ సెల్ నేతలతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహణ
  • చంద్రబాబు, లోకేశ్  బరితెగించి వ్యవహరిస్తున్నారన్న సజ్జల 
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేధింపులు మితిమీరి పోతున్నాయని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా విమర్శించారు. నిన్న ఆయన పార్టీ లీగల్ సెల్ నేతలతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ, వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించడాన్ని ఓర్వలేక వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. నియంతృత్వ పాలనకు ఇంతకంటే నిదర్శనం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేశ్ లు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వానికి వంత పాడుతున్న పోలీసుల చర్యలను ధీటుగా ఎదుర్కొందామని పిలుపునిచ్చారు.

చట్టాన్ని అతిక్రమిస్తున్న పోలీసులపై ప్రైవేట్ కేసులు వేద్దామని ఆయన అన్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగంపై పోరాటం చేస్తూ ముందుకెళ్తున్న పార్టీ లీగల్ సెల్‌ను ఆయన అభినందించారు. చంద్రబాబు, బాలకృష్ణ ఫ్లెక్సీలకు పొట్టేళ్ల తలలతో హారం వేసిన ఘటనపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఇటీవల ఒకరిపై రాజద్రోహం కేసు పెట్టారని, దీనికంటే దారుణం మరొకటి ఉండదని సజ్జల అన్నారు.

హక్కుల కోసం పోరాడినందుకు కమ్యూనిస్ట్ నాయకుడిపై పీడీ యాక్ట్ కేసు పెట్టడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. వైఎస్ జగన్ మరింత పట్టుదలతో పార్టీని నడిపిస్తూ, ప్రతి ప్రజా సమస్యపై ముందుండి పోరాడుతున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వ దమనకాండను తిప్పికొట్టేందుకు వైసీపీ సైన్యం పోరాట పటిమతో ముందుకు సాగుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. 


More Telugu News