రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం ఏర్పాటుపై స్పందించిన టీపీసీసీ చీఫ్

  • బాలు, రోశయ్యలు ఒక ప్రాంతానికి చెందిన వారు కాదన్న మహేశ్ కుమార్ గౌడ్
  • రవీంద్ర భారతిలో బాలు విగ్రహం ఉంటే తప్పేమిటని ప్రశ్న
  • దేవుళ్ల విషయంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను రాజకీయం చేయవద్దని విజ్ఞప్తి
హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి ప్రాంగణంలో దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఉంటే తప్పేమిటని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, కొణిజేటి రోశయ్య, ఎస్పీ బాలు ఒక ప్రాంతానికి చెందిన వారని అన్నారు. ఈ దేశానికి వారు ఒక సంపద అని వ్యాఖ్యానించారు. కాబట్టి బాలు విగ్రహాన్ని రవీంద్ర భారతిలో పెట్టడంలో తప్పేమి లేదని అన్నారు.

తెలంగాణ సెంటిమెంట్‌తో మరోసారి బీఆర్ఎస్ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. దేవుళ్ల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన సామెతను రాజకీయం చేయడం తగదని అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ కోసమే పనిచేస్తున్నట్లున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హిల్ట్ (హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్) పాలసీ ద్వారా హైదరాబాద్ నగరంలో సామాన్యులకు భూముల ధరలు అందుబాటులోకి వస్తాయని ఆయన అన్నారు. నగరం కూడా కాలుష్యరహితంగా మారుతుందని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతికి పాల్పడ్డారని, అందుకే తమ ప్రభుత్వం ఏం చేసినా కేసీఆర్ కుటుంబానికి అవినీతి మాదిరిగా కనిపిస్తోందని విమర్శించారు.


More Telugu News