వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిజం పూర్తిగా అంతం: రాజ్‌నాథ్ సింగ్

  • మావోయిజానికి 2026 మార్చి డెడ్‌లైన్ అన్న‌ రక్షణ మంత్రి 
  • మావోయిజంపై పోరులో భద్రతా దళాలది కీలక పాత్ర అన్న‌ రాజ్‌నాథ్
  • ఒకప్పటి రెడ్ కారిడార్లు ఇప్పుడు గ్రోత్ కారిడార్లుగా మారాయ‌ని వ్యాఖ్య‌
  • ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి వస్తున్న నక్సలైట్లు
  • పోలీసు సంస్మరణ దినోత్సవంలో అమరవీరులకు నివాళులు
దేశంలో మావోయిజంపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిజాన్ని దేశం నుంచి పూర్తిగా నిర్మూలిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

భద్రతా బలగాల సమష్టి కృషితో గత కొన్నేళ్లుగా మంచి ఫలితాలు వస్తున్నాయని రాజ్‌నాథ్ తెలిపారు. ఈ ఏడాది కూడా పలువురు అగ్రశ్రేణి నక్సలైట్లను మట్టుబెట్టినట్లు వెల్లడించారు. మావోయిజం ప్రభావిత జిల్లాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిందని, మిగిలిన కొన్ని ప్రాంతాలను కూడా వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తిస్థాయిలో మావోయిస్టు రహితంగా మారుస్తామని ఆయన స్పష్టం చేశారు. "ఈ సమస్య జాడలు కూడా లేకుండా పోతాయని దేశం మొత్తం నమ్మకంతో ఉంది" అని ఆయన అన్నారు.

ఒకప్పుడు ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో మావోయిజం పెను సమస్యగా ఉండేదని గుర్తుచేశారు. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, ఒకప్పుడు నక్సలైట్ల హింసతో వణికిపోయిన ప్రాంతాల్లో అభివృద్ధి పరుగులు పెడుతోందని వివరించారు. "గతంలో రెడ్ కారిడార్లుగా పేరుపొందిన ప్రాంతాలు ఇప్పుడు గ్రోత్ కారిడార్లుగా రూపాంతరం చెందుతున్నాయి" అని ఆయన పేర్కొన్నారు. ఆయా గ్రామాల్లో పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, రహదారులు వంటి మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు.

ఢిల్లీలోని జాతీయ పోలీసు స్మారక చిహ్నం వద్ద జరిగిన పోలీసు సంస్మరణ దినోత్సవంలో రాజ్‌నాథ్ పాల్గొన్నారు. 1959లో లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్ వద్ద చైనా సైనికుల దాడిలో ప్రాణాలు అర్పించిన 10 మంది పోలీసుల త్యాగాన్ని స్మరించుకుంటూ ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మావోయిజాన్ని అంతం చేయడంలో పోలీస్, సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, స్థానిక యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తున్న తీరు ప్రశంసనీయమని కొనియాడారు. వారి అవిశ్రాంత కృషి వల్లే ఈ సమస్య చరిత్రగా మిగిలిపోతోందని అన్నారు.

ప్రధాని మోదీ నాయకత్వంలో పోలీసు బలగాల ఆధునికీకరణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాజ్‌నాథ్ తెలిపారు. వారికి అత్యాధునిక ఆయుధాలు, డ్రోన్లు, నిఘా వ్యవస్థలు, ఫోరెన్సిక్ ల్యాబ్‌ల వంటి సాంకేతికతను అందిస్తున్నామని చెప్పారు. బలమైన పోలీసు వ్యవస్థతోనే బలమైన దేశ నిర్మాణం సాధ్యమని ఆయన పేర్కొన్నారు.


More Telugu News