గుజరాత్ మంత్రిగా రివాబా ప్రమాణ స్వీకారం.. స్పందించిన రవీంద్ర జడేజా

  • తన భార్య ప్రమాణ స్వీకారం చేయడం పట్ల జడేజా ఆనందం
  • అన్ని వర్గాల ప్రజలకు ప్రేరణగా నిలువాలన్న జడేజా
  • కేబినెట్ మంత్రిగా గొప్ప విజయాలు సాధించాలన్న జడేజా
గుజరాత్ మంత్రిగా తన భార్య రివాబా జడేజా ప్రమాణ స్వీకారం చేయడంపై భారత క్రికెటర్ రవీంద్ర జడేజా స్పందించాడు. తన భార్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. ఈ మేరకు 'ఎక్స్' వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. రివాబాకు ప్రాథమిక, మాధ్యమిక, వయోజన విద్యాశాఖను కేటాయించారు.

తన భార్య సాధించిన విజయాలకు ఎంతో గర్విస్తున్నానని జడేజా పేర్కొన్నాడు. ఇదే స్ఫూర్తితో రివాబా అద్భుతమైన కృషి చేస్తుందని, అన్ని వర్గాల ప్రజలకు ప్రేరణగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. గుజరాత్ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా గొప్ప విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపాడు. 'జైహింద్' అంటూ తన ట్వీట్‌ను ముగించాడు.

గుజరాత్ కేబినెట్‌ను పునర్వ్యవస్థీకరించాలనే ఉద్దేశంతో గురువారం ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా ఆ రాష్ట్ర మంత్రులందరూ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో శుక్రవారం కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ఇందులో రవీంద్ర జడేజా భార్య రివాబా కూడా ఉన్నారు.


More Telugu News