Chandrababu: పాలనలో మార్పు రావాలి.. పరిశుభ్రతపై దృష్టి పెట్టండి: కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

Chandrababu Focuses on Cleanliness and Governance Improvement
  • స్వచ్ఛాంధ్రపై సీరియస్‌గా ఉండాలని, పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని సూచన
  • సచివాలయ సిబ్బంది బదిలీలపై కలెక్టర్లకు పూర్తి అధికారాలు
  • కౌలు రైతులకు రుణాల మంజూరులో అడ్డంకులు తొలగించాలని ఆదేశం
  • పాలనలో డీప్ టెక్ వినియోగం పెంచాలని దిశానిర్దేశం
ఆరు జిల్లాల కలెక్టర్లతో సీఎం చంద్రబాబు నిర్వహిస్తున్న కాన్ఫరెన్స్ సమావేశం కొనసాగుతోంది. ఈ సందర్భంగా పలు శాఖల ఉన్నతాధికారులు తమ నివేదికలను ప్రజెంటేషన్ల రూపంలో సమర్పించారు. ఈ సమావేశంలో స్వచ్ఛాంధ్ర, పాలనలో సాంకేతికత వినియోగం, సచివాలయ సిబ్బంది సర్దుబాటు, కౌలు రైతుల సమస్యలపై సీఎం చంద్రబాబు పలు కీలక ఆదేశాలు, సూచనలు జారీ చేశారు.

ఇటీవల తాను కాకినాడ, సామర్లకోటలో పర్యటించినప్పుడు రోడ్ల పక్కన చెత్త కనిపించిందని, కొన్ని ప్రాంతాల్లో స్వచ్ఛాంధ్రపై సీరియస్‌నెస్ కొరవడిందని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్లు పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల కోసం నగరాలు, పట్టణాలు ఒకదానికొకటి పోటీ పడాలని సూచించారు. పరిశుభ్రత మన సంస్కృతిలో భాగమని, ఆరోగ్యానికి ఇది చాలా కీలకమని గుర్తుచేశారు.

గ్రామ, వార్డు సచివాలయాల్లోని సిబ్బంది సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం లేదని, ముఖ్యంగా మహిళా పోలీసుల సేవలు వృథా అవుతున్నాయని సీఎం పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, అవసరాన్ని బట్టి సిబ్బందిని ఆర్ అండ్ బి, హెల్త్, మున్సిపల్ వంటి ఇతర శాఖలకు సర్దుబాటు చేసే పూర్తి అధికారాలను కలెక్టర్లకు అప్పగిస్తున్నట్టు ప్రకటించారు. సిబ్బంది బదిలీలు సిఫార్సుల ఆధారంగా కాకుండా, రేషనలైజేషన్ ప్రకారమే పారదర్శకంగా జరగాలని స్పష్టం చేశారు.

కౌలు రైతులకు రుణాలు మంజూరు చేయడంలో ఎలాంటి నిబంధనలు అడ్డంకిగా ఉన్నా వాటిని వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయంతో పాటు ఉద్యాన, పశుసంవర్ధక రంగాల వైపు రైతులను ప్రోత్సహించాలన్నారు. యూరియా వాడకాన్ని తగ్గించేందుకు నానో యూరియాను ఉచితంగా అందించే అవకాశాన్ని పరిశీలించాలని, దీనిపై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని సూచించారు. ఈ నెల 16, 17, 18, 23, 24, 25 తేదీల్లో ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశించారు.

పాలనలో ఏఐ, బ్లాక్ చైన్, ఐఓటీ వంటి డీప్ టెక్నాలజీ వినియోగాన్ని పెంచడం ద్వారా వేగంగా, తక్కువ వ్యయంతో ఫలితాలు సాధించవచ్చని సీఎం తెలిపారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగానికి కంప్యూటర్ పరిజ్ఞానాన్ని తప్పనిసరి అర్హతగా చేర్చాలని సాధారణ పరిపాలన శాఖను ఆదేశించారు. ప్రతి జిల్లాలో హెచ్‌ఆర్ ఇనిస్టిట్యూట్, ఆర్టీజీఎస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుని పనితీరును మెరుగుపరుచుకోవాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.
Chandrababu
Andhra Pradesh
Collector Conference
Swachh Andhra
Municipal Commissioners
Tenant Farmers
Rythanna Meekosam
Deep Technology
HR Institute
RTGS

More Telugu News