ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్‌చిట్... తీవ్రంగా స్పందించిన బీజేపీ ఎంపీ
- స్పీకర్ ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అన్న లక్ష్మణ్
- ఎమ్మెల్యేలపై విచారణ పేరుతో కాలం వెళ్లబుచ్చారని విమర్శలు
- తెలంగాణను పార్టీ ఫిరాయింపులకు ప్రయోగశాలగా మార్చారని ఎద్దేవా
తెలంగాణ రాష్ట్రాన్ని గత కొంతకాలంగా పార్టీ ఫిరాయింపులకు ఒక ప్రయోగశాలగా మార్చారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పార్టీ కండువాలు కప్పారని, కానీ ఇప్పుడు మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. నైతిక విలువలకు, ప్రజాతీర్పుకు గౌరవం ఇచ్చే పార్టీ బీజేపీ మాత్రమే అన్నారు. ఒక్క ఓటుతో అధికారం కోల్పోతామని తెలిసి కూడా నాడు వాజపేయి ప్రభుత్వం ఫిరాయింపులను ప్రోత్సహించలేదని అన్నారు.
తెలంగాణలోని ఫిరాయింపులపై ఏఐసీసీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి రాజ్యాంగమే నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటులో నీతులు చెప్పే రాహుల్ గాంధీ, తెలంగాణలో వారి పార్టీ నాయకులు చేసే ఊసరవెల్లి రాజకీయాలపై మాట్లాడటం లేదని విమర్శించారు. ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒకరిని మించి ఒకరు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. దీనిపై న్యాయపరంగా పోరాటం చేస్తూ, కాంగ్రెస్ తీరును ప్రజల్లోకి తీసుకువెళతామని అన్నారు.