Monalisa Bhonsle: కుంభమేళా సెన్సేషన్ మోనాలిసా ప్రేమ పోరాటం: రక్షణ కోరుతూ పోలీసుల చెంతకు!
- కుంభమేళాలో పూసలు అమ్ముతూ రాత్రికి రాత్రే పాప్యులర్ అయిన మోనాలిసా
- ఏడాదిన్నరగా ఫర్మాన్ ఖాన్ అనే యువకుడితో ప్రేమలో ఉన్న మోనాలిసా
- తమ బంధాన్ని తల్లిదండ్రులు అంగీకరించడం లేదని ఫిర్యాదు
మహా కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్‌గా మారిన మోనాలిసా భోంస్లే మళ్లీ వార్తల్లో నిలిచింది. తన ప్రేమ వివాహానికి రక్షణ కల్పించాలంటూ ఆమె తిరువనంతపురంలోని తంపనూర్ పోలీసులను ఆశ్రయించింది. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన మహారాష్ట్రకు చెందిన ఫర్మాన్ ఖాన్‌తో గత ఏడాదిన్నరగా ఆమె ప్రేమలో ఉంది. అయితే, ఈ బంధానికి మోనాలిసా తల్లిదండ్రులు అంగీకరించకపోవడమే కాకుండా, తండ్రి విజయ్ సింగ్ భోంస్లే తనకు నచ్చిన వ్యక్తితో వివాహం చేయాలని ఒత్తిడి చేస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తన ప్రియుుడితో కలిసి ఆమె పోలీస్ స్టేషన్ కు వెళ్లింది.
కుంభమేళాలో తన అందంతో మెప్పించిన మోనాలిసాకు సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. 'ది డైరీ ఆఫ్ మణిపూర్', మలయాళ చిత్రం 'నాగమ్మ'తో పాటు తెలుగులో 'లైఫ్' అనే చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. వృత్తిపరంగా ఎదుగుతున్నా, వ్యక్తిగత జీవితంలో ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా ఆమె పోలీసుల జోక్యం కోరింది. దీనిపై స్పందించిన పోలీసులు.. ఇది కేవలం బలవంతపు వివాహ ప్రతిపాదనకు సంబంధించిన అంశమని, ఇంకా కేసు నమోదు చేయలేదని వెల్లడించారు. గ్లామర్ ప్రపంచంలో మెరుస్తున్న ఈ కుంభమేళా సుందరి తన ప్రేమను గెలిపించుకుంటుందో లేదో వేచి చూడాలి.